కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం స్వీకరణ
రేపట్నుంచి జరిగే గ్రామసభల్లోనూ దరఖాస్తులు తీసుకోవాలి
ఆత్మీయ భరోసా సొమ్ము మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ
కలెక్టర్లకు సీఎస్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామసభల్లోనూ ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఆదివారం ఓ సర్క్యులర్‌ను పంపారు.
దాని ప్రకారం గ్రామ సభల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక కుటుంబం నుంచి వేరు పడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులిచ్చేందుకు కూడా దరఖాస్తులు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యు ల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించాలి.
అదేవిధంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు, మీసేవ కేంద్రాల నుంచి వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఇప్పటికే వచ్చిన 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కుటుంబాల దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలి. కులగణనలో భాగంగా కార్డు లేదని సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా పరిశీలించాలి. వీటికి తోడు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
గ్రామసభల్లో ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్లకు కూడా గ్రామసభల్లో దరఖాస్తులు వస్తే తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని వారి వివరాలను కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని, వాటి పరిశీలన వెంటనే పూర్తి చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రేషన్‌కార్డుల తరహాలోనే దరఖాస్తుదారుల అన్ని వివరాలను గ్రామ సభల్లో నమోదు చేసుకోవాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మదింపు చేయడం, ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోలేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.
ఆ పంచాయతీల్లోనూ ఆత్మీయ భరోసా
భూమి లేని పేదల కుటుంబాలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయాన్ని ఆ కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సీఎస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటికే కలెక్టర్లకు, డీఆర్‌డీవోలకు పంపామని పేర్కొన్నారు. అదే విధంగా 2023–24 సంవత్సరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం అయిన 156 గ్రామ పంచాయతీల్లోనూ ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సర్క్యులర్‌లో సీఎస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment