‘హజ్’ కోటా పెంచండి
హజ్ యాత్ర నిమిత్తం రాష్ట్రంలోని ముస్లింలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటుస్తున్నారు. దరఖాస్తులు ఈ ఏడాది పెరగడంతో రాష్ట్రానికి హజ్ సీట్ల కోటా పెంచాలన్న విజ్ఞప్తిని కేంద్రం ముందు ప్రభుత్వం ఉంచింది. పీఎం నరేంద్ర మోడీ జోక్యానికి విజ్ఞప్తి చేస్తూ శనివారం సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు.
సాక్షి, చెన్నై : ఇస్లాం పంచ సూత్రాల్లో హజ్ పయనం ఒకటి. మహ్మద్ ప్రవక్త చేసిన ఉపదేశాల మేరకు జీవిత కాలంలో ప్రతి ముస్లిం హజ్ పయనం తప్పని సరిగా చేయాల్సి ఉంది. ఈ యాత్రతో బక్రీద్ పర్వదినాన మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రతి ముస్లిం పునీతులు అవుతారు. సంపన్నులు తమ స్థోమత మేరకు ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా హజ్ యూత్రకు వెళుతుంటారు. ఇక పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధిక సాయం అందిస్తున్నాయి. ఏటా రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి హజ్ యాత్రకు పంపుతూ వస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో హజ్ పయనానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఈ ఏడాది బక్రీద్ పర్వదినం అక్టోబరులో రానుంది. రంజాన్ ముగియగానే, హజ్ యాత్ర ఏర్పాట్లు ఆరంభం అవుతాయి. ఇప్పటి నుంచి దరఖాస్తులను ఆహ్వానించే పనిలో హజ్ కమిటీ పడింది. దరఖాస్తుల వెల్లువ : హజ్ యాత్రకు ప్రతి ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 13,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హజ్ సీట్ల కోటా మాత్రం కనిష్టంగానే ఉంది. ప్రతి ఏటా కేంద్రాన్ని హజ్ కోటా సీట్ల పెంపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకుంటూ వస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం తమిళనాడులోని ముస్లింలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని, కోటాను పెంచారు. అయితే, ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఉన్న సీట్లకు కోత విధించడం చర్చనీయాంశంగా మారుతోంది.
కోటా పెంచరూ : గతంలో కంటే, ఈ సారిగా తక్కువగా ముంబైలోని హజ్ కమిటీ రాష్ట్రానికి సీట్లను కేటాయించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అప్రమత్తమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీట్లను రాబట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జోక్యానికి విజ్ఞప్తి చేస్తూ శనివారం లేఖాస్త్రం సంధించారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లీంలు దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారని తన లేఖలో వివరించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు 2672 మందిని మాత్రమే అనుమతిస్తూ ముంబైలోని భారత హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇందులో 1180 మంది బీసీ కేటగిరి, 1492 మంది ఓసీ ముస్లింలను మాత్రమే అనుమతించనున్నారు. అయితే, ఈ సంఖ్య చాలా తక్కువ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది హజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే వేలాది మంది ముస్లింలు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయూంలో 2012లో తమిళనాడు నుంచి 3,500 మంది, 2013లో 4 వేల మంది వరకు హజ్ యాత్రకు అనుమతించే రీతిలో కేటాయింపులు జరిగాయని వివరించారు. అయితే, ఈ ఏడాది సీట్ల సంఖ్యను తగ్గించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని రీతిలో అతి తక్కువ సీట్లను కేటాయించడం శోచనీయమని, రాష్ట్రంలో ముస్లింల జనాభాను, వస్తున్న దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని హజ్‌యాత్ర సీట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అవసరానికి తగ్గట్టుగా మరిన్ని సీట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు భారత హజ్ కమిటీనీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని కోరారు. రాష్ట్రం నుంచి అత్యధిక శాతం మంది ముస్లింలను హజ్ యాత్రకు పంపించాలన్న కాంక్ష తమ ప్రభుత్వానికి ఉందని, ఇందుకు తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు.