అందరి ప్రార్థనలు ఫలించాయి
► డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
► అన్ని వర్గాలకు సముచిత స్థానం
► మసీదు ఇమామ్‌ల గౌరవ వేతన పథకం ప్రారంభం
సాక్షి,సిటీబ్యూరో: సర్వమతాల ప్రార్థనల ఫలితంగా ‘తెలంగాణ’ ఏర్పాటయ్యిందని ఉపముఖ్యమంత్రి మహ మూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు పరిధిలోని మసీదుల ఇమామ్, మౌజమ్‌లకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రవేశ పెట్టిన ‘గౌరవ వేతన పథకాన్ని’ సోమవారం రాష్ట్ర హజ్‌హౌస్ లో ఉపముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారన్నారు.ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మసీదు ఇమామ్, మౌజ మ్ లకు చేయూతనందించేందుకు గౌరవ వేతన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.
పది జిల్లాల నుంచి 4,901 ఇమామ్, 4,033 మంది మౌజమ్‌ల నుంచి దరఖాస్తులు అందాయని, వక్ఫ్‌బోర్డులో నమో దు కాని మసీదు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముస్లిం మైనార్టీల వెనుకబాటుకు నిరక్షరాస్యతే ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా ఉచిత విద్య అందించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. మసీదు కమిటీలు, ఇమా మ్, మౌజమ్‌లు విద్యను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ మైనార్టీ శాఖ అవినీతిమయమైందని, ప్రభుత్వ కార్యక్రమాలకు మైనార్టేతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సలీమ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 551 ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాన్ని గత జూలై నుంచి పాత బకాయిలు కలుపుకొని ఒక్కొక్కరికి రూ.9000 చొప్పున అందచేశారు.