పైసలిస్తేనే పని (‘పైసా’చికం)
రెవెన్యూ శాఖలో జోరుగా అవినీతి
నర్సాపూర్‌లో వెళ్లూనుకున్న దందా
పాస్ పుస్తకాలు సైతం అమ్ముకుంటున్న వైనం
పెండింగ్‌లో వేలాదిగా దరఖాస్తులు
కళ్లప్పగించి చూస్తున్న ఉన్నతాధికారులు
ఏసీబీ దాడి చేసినా మారని దుస్థితి
నర్సాపూర్:రెవెన్యూ శాఖలో అవినీతిదే రాజ్యం.. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతోంది. ఇటీవల తహసీల్దారు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనే ఇందుకు నిదర్శనం. డబ్బులు లేనిదే ఏ పని కావడంలేదు. రైతు మల్లేశం.. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తనతో పాటు తన అక్క వీరమణి పేర్లమీద మార్చాలని నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించకపోగా.. రూ.20వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని చెప్పడంతో ఆ రైతు ఏసీబీనీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఇలాంటివి వెలుగుచూడని ఘటనలు ఎన్నో..
అమలుకాని నిబంధనలు
నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాల్లో నిబంధనలు అమలు కావడం లేదు. వంశపారంపర్యంగా వచ్చే భూములను తమ పేర్లపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే.. విచారణ చేపట్టి ఎలాంటి ఆక్షేపణలు రాని పక్షంలో 15 రోజుల్లోనే మార్పు చేయాల్సి ఉంటుంది.
రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నప్పటకీ పలువురు అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయంటూ పనులన్నీ పెండింగ్‌లో పెట్టి డబ్బును గుంజుతున్నారు.
పెండింగ్‌లో దరఖాస్తులు
పేర్లు మార్పు కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసినా, రిజిష్ట్రేషన్ డాక్యుమెంటును నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వచ్చినా వాటిని పట్టించుకోవడంలేదు. నిర్ణీత గడువు దాటినా వాటిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు.
భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు వచిచ్న దరఖాస్తులు.. నర్సాపూర్ మండలంలో సుమారు 50, కౌడిపల్లిలో 56, హత్నూరలో 38, వెల్దుర్తిలో వందలాదిగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది.
ఒక్కో చోట ఒక్కో తీరు వసూళ్లు..
భూముల పేర్లు మార్పు చేసేందుకువచ్చే దరఖాస్తుదారుల నుంచి ఒక్కో చోట ఒక్కోవిధంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్‌లో ఇటీవల రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంత మంది వ్యాపారులు గుంట నుంచి ఐదు గుంటల వరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి వాటిని వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసేందుకు దరఖాస్తులు చేశారు. వీటిని మార్చేందుకు రూ. వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నాలా దరఖాస్తుదారుల నుంచి ఐదు నెలల వ్యవధిలోనే లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం.
ఇదిలాఉండగా గతంలో ఇక్కడ పని చేసిన అధికారి బదిలీ కావడంతో దరఖాస్తుదారు నుంచి 40 వేల రూపాయలు తీసుకుని ఆగమేఘాల మీద విచారణ చేపట్టి నాలా దరఖాస్తును పై అధికారులకు పంపినట్టు వినికిడి.
కొల్చారం మండలంలోని పైతర, రంగంపేట, తుక్కాపూర్ గ్రామాలకు చెందిన రైతులు భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు నెలలతరబడి తహసిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడంలేదు.
ఓ అధికారి పెద్ద ఎత్తున భూముల కొనుగోలు
ఇటీవల నర్సాపూర్లో ఇద్దరు అధికారులు, ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా అందులో ఒక అధికారి కొన్ని నెలల క్రితం మండలంలోని మూసాపేట గ్రామంలో సుమారు 13ఎకరాల వ్యవసాయ భూములను సుమారు 80లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తన బందువుల పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది.
పాస్ పుస్తకాలను సైతం అమ్ముకుంటుండ్రు
పాస్ పుస్తకాలను అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు.
రైతులకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాలను నామమాత్రంగా 30 రూపాయల ధరకు సరఫరా చేస్తుంది. కాగా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ లేవంటూ విఆర్‌ఓలు అడ్డగోలుగా అమ్ముతున్నారు. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వాటిని అమ్ముతున్నా ఏ అధికారి చర్యలు తీసుకోకోవడం గమనార్హం. పదుల నుంచి వేల రూపయాలుగా ధర నిర్ణయించి అమ్ముతున్నారరంటె అవినీతీ ఏ మేరకు ఉందో తెలుస్తుంది.
ఆన్‌లైన్ విధానం పకడ్బందీగా అమలు
ఆన్‌లైన్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవినీతికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పిడికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని సూచించాం. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో తన దృష్టికి తేవాలి.
- మెంచు నగేష్, మెదక్ ఆర్‌డీఓ