esibi
-
అవినీతిపరుల ఆటకట్టిస్తా
ఏసీబీ కొత్త డీఎస్పీ కరణం రాజేంద్ర బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం సిటీ : ప్రజల సహకారంతో అవినీతిపరుల ఆటకట్టిస్తానని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నూతన డీఎస్పీ కరణం రాజేంద్ర అన్నారు. జిల్లా డీఎస్పీగా నియమితులైన ఆయన శుక్రవా రం బాధ్యతలను స్వీకరించా రు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కె.రంగరాజుకు విశాఖపట్నం హార్బర్ ఏసీపీగా ఇటీవల బదిలీ అరుున విషయం విదితమే. కాగా 1989లో పోలీసు శాఖలో చేరిన కరణం రాజేంద్ర ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజ మండ్రి, ఏలూరు ప్రాంతాల్లో వివిధ కేడర్లలో పని చేశారు. జిల్లాలో ఎస్సై, సీఐగా పని చేసిన రాజేంద్ర పదేళ్ల తర్వాత ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని బారువ, సోంపేట, సరుబుజ్జలి, నరసన్నపేట, విజయనగరం జిల్లా డెంకాడ, భోగాపురం, గజపతినగరంలో ఎస్సైగా పని చేసిన ఈయన పాతపట్నం, రణస్థలం సీఐగా, విజయనగరంలో ఏపీఎస్పీ బెటాలియన్‌లో డీఎస్పీగా, విశాఖపట్నం మధురవాడలో ఏసీపీగా, సీఐడీ విభాగంలో (వైజాగ్, చింతలవలస)లో పని చేశారు. ఏలూరులో 20 నెలల పాటు ఏసీబీ డీఎస్పీగా పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. సహకారం అవసరం ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో ‘సాక్షి’తో రాజేంద్ర మాట్లాడారు. అవినీతిపరుల ఆటకట్టించేందుకు ప్రజలు, ఉద్యోగులతో పాటు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎవరికి ఉన్నా అలాంటి వారి వివరాలను నిర్భయంగా ఏసీబీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా సమచారం ఇవ్వాలనుకుంటే.. తన ఫోన్ నంబర్: 9440446124, లేదా ఏసీబీ కార్యాలయం, శ్రీకాకుళం: 08942-222754 నంబర్‌కు తెలియజేయాలని రాజేంద్ర కోరారు. -
పైసలిస్తేనే పని (‘పైసా’చికం)
రెవెన్యూ శాఖలో జోరుగా అవినీతి నర్సాపూర్‌లో వెళ్లూనుకున్న దందా పాస్ పుస్తకాలు సైతం అమ్ముకుంటున్న వైనం పెండింగ్‌లో వేలాదిగా దరఖాస్తులు కళ్లప్పగించి చూస్తున్న ఉన్నతాధికారులు ఏసీబీ దాడి చేసినా మారని దుస్థితి నర్సాపూర్:రెవెన్యూ శాఖలో అవినీతిదే రాజ్యం.. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతోంది. ఇటీవల తహసీల్దారు, వీఆర్ఓ, వీఆర్ఏలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనే ఇందుకు నిదర్శనం. డబ్బులు లేనిదే ఏ పని కావడంలేదు. రైతు మల్లేశం.. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తనతో పాటు తన అక్క వీరమణి పేర్లమీద మార్చాలని నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించకపోగా.. రూ.20వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని చెప్పడంతో ఆ రైతు ఏసీబీనీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఇలాంటివి వెలుగుచూడని ఘటనలు ఎన్నో.. అమలుకాని నిబంధనలు నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాల్లో నిబంధనలు అమలు కావడం లేదు. వంశపారంపర్యంగా వచ్చే భూములను తమ పేర్లపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే.. విచారణ చేపట్టి ఎలాంటి ఆక్షేపణలు రాని పక్షంలో 15 రోజుల్లోనే మార్పు చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నప్పటకీ పలువురు అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయంటూ పనులన్నీ పెండింగ్‌లో పెట్టి డబ్బును గుంజుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు పేర్లు మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా, రిజిష్ట్రేషన్ డాక్యుమెంటును నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వచ్చినా వాటిని పట్టించుకోవడంలేదు. నిర్ణీత గడువు దాటినా వాటిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు వచిచ్న దరఖాస్తులు.. నర్సాపూర్ మండలంలో సుమారు 50, కౌడిపల్లిలో 56, హత్నూరలో 38, వెల్దుర్తిలో వందలాదిగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఒక్కో చోట ఒక్కో తీరు వసూళ్లు.. భూముల పేర్లు మార్పు చేసేందుకువచ్చే దరఖాస్తుదారుల నుంచి ఒక్కో చోట ఒక్కోవిధంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్‌లో ఇటీవల రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంత మంది వ్యాపారులు గుంట నుంచి ఐదు గుంటల వరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి వాటిని వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసేందుకు దరఖాస్తులు చేశారు. వీటిని మార్చేందుకు రూ. వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నాలా దరఖాస్తుదారుల నుంచి ఐదు నెలల వ్యవధిలోనే లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా గతంలో ఇక్కడ పని చేసిన అధికారి బదిలీ కావడంతో దరఖాస్తుదారు నుంచి 40 వేల రూపాయలు తీసుకుని ఆగమేఘాల మీద విచారణ చేపట్టి నాలా దరఖాస్తును పై అధికారులకు పంపినట్టు వినికిడి. కొల్చారం మండలంలోని పైతర, రంగంపేట, తుక్కాపూర్ గ్రామాలకు చెందిన రైతులు భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు నెలలతరబడి తహసిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడంలేదు. ఓ అధికారి పెద్ద ఎత్తున భూముల కొనుగోలు ఇటీవల నర్సాపూర్‌లో ఇద్దరు అధికారులు, ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా అందులో ఒక అధికారి కొన్ని నెలల క్రితం మండలంలోని మూసాపేట గ్రామంలో సుమారు 13ఎకరాల వ్యవసాయ భూములను సుమారు 80లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తన బందువుల పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. పాస్ పుస్తకాలను సైతం అమ్ముకుంటుండ్రు పాస్ పుస్తకాలను అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాలను నామమాత్రంగా 30 రూపాయల ధరకు సరఫరా చేస్తుంది. కాగా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ లేవంటూ విఆర్ఓలు అడ్డగోలుగా అమ్ముతున్నారు. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వాటిని అమ్ముతున్నా ఏ అధికారి చర్యలు తీసుకోకోవడం గమనార్హం. పదుల నుంచి వేల రూపయాలుగా ధర నిర్ణయించి అమ్ముతున్నారరంటె అవినీతీ ఏ మేరకు ఉందో తెలుస్తుంది. ఆన్లైన్ విధానం పకడ్బందీగా అమలు ఆన్లైన్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవినీతికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పిడికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని సూచించాం. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో తన దృష్టికి తేవాలి. - మెంచు నగేష్, మెదక్ ఆర్డీఓ -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ ప్రిన్సిపాల్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడి మెదక్: పదిమందికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్ ఓ లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. బాధిత లెక్చరర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... శ్రీనివాస్ అనే వ్యక్తి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 2008 నుంచి రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు. కానీ వేతనం మాత్రం మెదక్ జూనియర్ కళాశాలలోనే పొందాల్సి ఉంది. గతనెలకు సంబంధించి రూ.38,268ల వేతనం రావాల్సి ఉండగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తనకు రూ.4 వేలు లంచం ఇస్తేనే ఫైల్‌పై సంతకం చేస్తానని మొండికేశాడు. చేసేది లేక లెక్చరర్ శ్రీనివాస్ ఈనెల 6న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు సోమవారం శ్రీనివాస్ రూ.4 వేలు లంచంగా ఇవ్వగా ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామి తీసుకుని ఫైల్‌పై సంతకం చేశాడు. అప్పటికే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నవీన్‌కుమార్‌లు ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ రాఘవేంద్రస్వామిని హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలిస్తామన్నారు. లంచం ఇవ్వొద్దు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరు లంచం అడిగినా ఇవ్వకూడదని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. సోమవారం మెదక్ పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ... లంచం ఎవరు అడిగినా వెంటనే 9440446149 నంబర్లో తమను సంప్రదించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 16మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేశామన్నారు. ఈ యేడు జిల్లాలో మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మెదక్ కోర్టులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించే వ్యక్తి రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సిద్దిపేట మండలం తడ్కపల్లిలో ఓ పంచాయతీ అధికారి లంచం తీసుకుంటూ చిక్కాడు. తాజాగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాఘవేంద్రస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా ఈ యేడు మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. -
కన్ను పడితే కాసులే..
- కూకట్పల్లి పరిధిలో ఇమాన్యుయేల్ అక్రమాలు - ప్రముఖుల అండతో వసూళ్లు కూకట్పల్లి : ఆయన కన్ను పడిందంటే వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే బేరసారాలు.. లేదంటే అక్కడి వారి కలల సౌధం కాస్తా కల్లే.. ఇక అక్రమ నిర్మాణం వెలుస్తుందంటే ఆయనకు పంట పండినట్లే. అక్రమ నిర్మాణాల్లో ఏకంగా భాగస్వామి అయ్యేందుకు కూడా వెనుకాడడంటే ఆయన అవినీతి ఎంటో అర్థమవుతుంది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేసే ఇమాన్యుయేల్ బాగోతం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఏసీబీ సోమవారం ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో కళ్లుతిరిగే ఆస్తులు వెలుగుచూశాయి. ఒక్క కూకట్పల్లి మున్సిపాలిటీనే ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దాడుల ద్వారా తేటతెల్లమవుతోంది. సర్కిల్ మొత్తం చుట్టేసి... కూకట్పల్లి సర్కిల్లో మొదట మోతీనగర్ సెక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇమాన్యుయేల్ ఆ ప్రాంతంలో లెక్కకు మిక్కిలిగా జరిగిన నిర్మాణదారులు ఆయనకు కాసుల రుచిని చూపించారు. ఆ సమయంలోనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ వేటు వేయగా 24 గంటల్లోనే తనకున్న రాజకీయ, సామాజిక పలుకుబడితో బదిలీని నిలిపివేయించుకున్నారు. ఈ విధంగా మూడు పర్యాయాలు అతడిపై వచ్చిన ఆరోపణలతో బదిలీ చేయాలని ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పుడల్లా పైస్థాయిలో పైరవీలు చేయించుకున్నాడు. మోతీనగర్ నుంచి మూసాపేట్, ఆ తరువాత కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్‌కాలనీ డివిజన్లలో ఆయన అవినీతి ప్రస్థానం కొనసాగింది. అతడికున్న రాజకీయ పలుకుబడితో కింది స్థాయి సిబ్బందిని మార్చడమే కాకుండా పైస్థాయి అధికారులను సైతం తన సామాజిక అస్త్రంతో బెదిరింపులకు పాల్పడ్డాడన్న వార్తలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు అతడి చుట్టూ నెలల తరబడి చక్కర్లు కొట్టక తప్పని పరిస్థితి. పెద్ద మొత్తంలో కాసులు కురిపించే అక్రమ నిర్మాణదారులకు మాత్రం తివాచీ పరచడం తనకు తానే సాటి. దందాలన్నీ బయటనే... చిన్న చిన్న నిర్మాణాలు చేసుకునేవారు అనుమతుల కోసం సర్కిల్ కార్యాలయానికి వెళితే.. కంటికి కూడా కనిపించని పరిస్థితులు ఉండేవి. బడా నిర్మాణదారులతో మంతనాలు జరుపుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కార్యాలయంలో దొరకకుండా బయటనే తన దందాలన్నీ సాగిస్తాడనేది సమాచారం. ఇదిలా ఉంటే నిర్మాణదారులు ముందుగా తనను కలిసిన తరువాతనే ఏ పనైనా చేయాలని డాక్యుమెంట్ రైటర్లకు సైతం హుకుం జారీ చేస్తారు. లేదంటే లెసైన్స్ రద్ధవుతుందన్న భయభ్రాంతులకు గురిచేసేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేచి చూసి....ఆపై రంగంలోకి... ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ముందుగా తెలిసినప్పటికీ నిర్మాణ ప్రారంభ సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడరు. నిర్మాణం కాస్తా పైకి లేచినప్పుడు రంగంలోకి దిగి కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుంటాడు. . గతంలో ఇంటి నిర్మాణదారులకు బెదిరింపులకు పాల్పడిన సంఘటనల్లో ఇమానుయేల్పై పోలీస్‌స్టేషన్ వరకు ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. -
ఇద్దరు పోలీసులపై ఏసీబీ కేసు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు పోలీసులపై ఏసీబీ కేసు నమోదరుుంది. పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రామాంజనేయులు రూ.30వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు అదే స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబునాయుడు కూడా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఏర్పేడు ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో పడిన విషయం తెలిసిందే. పోలీసుల అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది. న్యాయవాది ఫిర్యాదు మేరకు... పట్టణానికి చెందిన వంగపాటి వెంకటయ్య అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడులు నిర్వహించామనీ, ఈ దాడుల్లో ఎస్ఐ రామాంజనేయులు రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ తిరుపతి డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. దాడుల అనంతరం గురువారం డీఎస్పీ శంకర్‌రెడ్డి టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంగపాటి వెంకటయ్య అనే న్యాయవాదికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండు కేసులు (సీఆర్.నెంబర్ 95-2012,96-2012)కు ఎస్ఐ రామాంజనేయులు రూ.30వేలు డిమాండ్ చేశారని తెలిపారు. ఆ మేరకు న్యాయవాది ఫిర్యాదు చేయడంతో గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడులు నిర్వహించి పట్టుకున్నామని చెప్పారు. ఎస్ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ బాబునాయుడు కూడా లంచం తీసుకున్నట్లు కెమికల్ లిక్విడ్ టెస్ట్ ద్వారా కూడా గుర్తించామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, రామకిషోర్ పాల్గొన్నారని చెప్పారు. అధికారులు లంచాలకు పాల్పడుతుంటే ఏసీబీ అధికారుల నెంబర్లు 9440808112, 9440446190, 9440446193, 9440446138, 9440446191,9440446120 కు ఫోన్ ద్వారా సమాచారం అందివ్వాలని ప్రజలకు సూచించారు.