రెవెన్యూ రికార్డుల గోల్‌మాల్!
వాకాడు : రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రికార్డుల్లో పేర్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. వాకాడు మండలంలోని తీరప్రాంతం కోస్టల్ కారిడార్‌లో ఉండటంతో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే తూపిలిపాళెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ( ఎన్‌ఐఓటీ)కి శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి భూసేకరణ కూడా పూర్తయింది. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం కూడా ప్రతిపాదనలో ఉంది. ఇంకా పలు ప్రాజెక్టులు, పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భూముల విలువకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో కొందరి కన్ను ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీద పడింది. వారికి కొందరు అవినీతి అధికారులు అండగా నిలవడంతో రికార్డుల్లో పేర్లు తారుమారవుతున్నాయి. విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని ఉదాహరణలు..
దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని 805, 806,808,809,810 సర్వే నంబర్ల భూమిని సంబంధించి గతంలో నిరుపేదలకు పట్టాలు మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే నంబర్లకు సంబంధించిన అడంగల్, డి రిజిస్టర్‌లో పేర్లను దిద్దేసినట్లు అసలైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వల్లమేడు పరిధిలోని 15, 27 సర్వే నంబర్లకు సంబంధించి 4.16 ఎకరాల భూముల అనుభవదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మారిపోయినట్లు సమాచారం. ఇలా సుమారు 300 ఎకరాలకు సంబంధించి రికార్డులు మారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో పేర్లు మార్పు చేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములకు అయితే పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పొందినట్లు తెలిసింది.
పొంతన కుదరని వివరాలు
సాధారణంగా ప్రభుత్వ భూముల వివరాలు ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్ ఆధీనంలో ఉంటాయి. ప్రతి మండల సర్వేయర్, తహశీల్దార్ కార్యాలయంలోనూ ఒక్కో కాపీ ఉంచుతారు. అయితే ప్రస్తుతం సర్వే అండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఉన్న కాపీకి తహశీల్దార్ కార్యాలయంలోని పెయిర్ అడంగల్‌కు పొంతన కుదరనట్లు సమాచారం. సర్వేయర్ వద్ద ఉన్న వాస్తవ కాపీతో సరిపోల్చితే తహశీల్దార్ అడంగల్ కాపీలో దిద్దుబాటులు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన కొందరు తహశీల్దార్లు, వీఆర్వోల సహకారంతోనే ఈ అక్రమాల పర్వం జరిగిందని తెలుస్తోంది.
మరోవైపు గతంలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమి కూడా ఆక్రమణల ఉచ్చులో చిక్కుకుని ఉన్నాయి. భూములను ఆక్రమించిన కొందరు ఇప్పటికే వాటిని విక్రయించి సొమ్ము చేసేసుకున్నారు. ప్రధానంగా దుగరాజపట్నం, కాకివాకం, కొండూరు, కొండూరుపాళెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఈ అక్రమణల పర్వం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆరేళ్లుగా తిరుగుతున్నాం:
వాకాడులోని సర్వే నంబర్ 528లో ప్రభుత్వం నాకు అర ఎకరా భూమిని మంజూరు చేసింది. అయితే కొందరు అధికారుల కారణంగా భూమి నాకు దక్కలేదు. మరొకరు సాగు చేసుకుంటున్నారు. ఆరే ళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కరువైంది.
- కార్యం భువనేశ్వరి, బీసీ కాలనీ వాకాడు.
నా పొలం రికార్డులను మార్చేశారు:
దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని 805, 806, 808, 809, 810 సర్వే నంబర్లలో ప్రభుత్వం నాకిచ్చిన సీలింగ్ పట్టా భూమికి సంబంధించి రికార్డుల్లో నా పేరు మార్చేశారు. దుగరాజపట్నం రెవెన్యూ డీ రిజస్టర్‌లో లబ్ధిదారుల పేర్లను తొలగించి ఇతరులను చేర్చారు. అడంగల్‌లో కూడా మార్చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అడంగళ్లు తహశీల్దార్ కార్యాలయంలో లేవంటున్నారు.
- పాశం ఏడుకొండలు, దుగరాజపట్నం
విచారించి చర్యలు తీసుకుంటాం..
రికార్డులు తారుమారు అయిన విషయం నా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే విచారించి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. దుగరాజపట్నం పోర్టు రానున్న దృష్ట్యా ఆ పంచాయతీ పరిధిలోని రెవెన్యూ భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సంబంధిత రికార్డులను సబ్‌కలెక్టర్ వారు తీసుకెళ్లారు.
- తహశీల్దార్ ఈశ్వరమ్మ