అవినీతి రెవెన్యూ
► రికార్డుల తారుమారులో నంబర్ 1
► ప్రభుత్వ, పట్టా భూములు మాయం
► అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు.. ధనదాహం
► ఇప్పటికి ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్
► ఆర్‌ఐలు, వీఆర్వోలు కూడా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెవెన్యూ శాఖకు రోజుకొక అవినీతి మరక అంటుకుంటోంది. మొన్న సూళ్లూరుపేట తహసీల్దార్ మునిలక్ష్మి, నిన్న కలిగిరి తహసీల్దార్ లావణ్య.. నేడు నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్. మరికొందరు ఆర్‌ఐలు, వీఆర్వోలు. వీరంతా అవినీతికి పాల్పడ్డారనే కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి పాసుపుస్తకాలు తారుమారు చేయటం, మరికొందరు పాసుపుస్తకాలు ఇచ్చే విషయంలో మామూళ్లు పుచ్చుకోవటం షరామామూలైపోయింది.
జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ, డాటెడ్, ప్రైవేటు భూములు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూములు, స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను కొందరు తహసీల్దార్లు, ఆర్‌ఐ, వీఆర్వోలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా ఒకరి పేరుతో ఉన్న భూములను వేరొకరికి మార్చి సొమ్ముచేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి కుటుం బాల రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరు. అదే అధికారపార్టీ నాయకులు, లంచం ఇచ్చేవారికే ఎదురెళ్లి స్వాగతం పలికి మరి పనులు చేసిపెడుతున్నారు.
కంచే చేను మేస్తోంది
పల్లెలు, పట్టణాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ప్రజలకు ఎదురయ్యే సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. అయితే ప్రస్తుతం రెవెన్యూశాఖ అందుకు విరుద్ధంగా తయారైంది. కొందరు అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేరొకరికి కట్టబెట్టి సొమ్ము చేసుకోవటం ఆనవాయితీగా మార్చేసుకున్నారు. గతంలో సూళ్లూరుపేట తహసీల్దార్‌గా పనిచేసిన మునిలక్ష్మి వాకాటి రామనాథమ్మ కు చెందిన భూములను వాకాటి రమేష్‌రెడ్డివిగా రికార్డులు తారుమారు చేశారు. అధికారపార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఒత్తిడి, డబ్బులపై ఆశతో ఆమెచేత ఈ పనిచేయించింది. దీంతో మునిలక్ష్మి, ఆర్‌ఐ కిరణ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా కలిగిరి తహసీల్దార్‌గా పనిచేసిన లావణ్య కొండాపురం మండలం గానుగపెంట, పొట్టిపల్లిలోని 120 ఎకరాల అటవీ, మంత్రి ఘంటా శ్రీనివాసరావు భూములకు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారనే ఆరోపణలతో ఆమెను విధుల నుంచి తొలగించారు.
తాజాగా నెల్లూరు రూర ల్ మండల తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్ శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూముల్లోని టేకుచెట్ల నరికివేతకు సహకరించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువచేసే టేకుచెట్ల కొట్టివేతకు కారణమయ్యారు. దీంతో జనార్దన్‌పై వేటు వేయటంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా రు. భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా అవతారం ఎత్తుతుంటే ప్రజల సమస్యలను పరిష్కరించే వారు ఎవరనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తుతోంది. భూసమస్యల పరిష్కారం కో సం తహసీల్దార్ కార్యాలయం తొక్కాలంటే ప్రజలు వణికిపోతున్నారు. రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెడుతారేమోనని భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాసమస్యల పట్ల స్పందించి పరి ష్కరించే దిశగా కృషిచేయాలని కోరుకుంటున్నారు.