సర్వే నంబర్‌లోని విస్తీర్ణానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయాలని భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ) కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సర్వే నంబర్‌లోని విస్తీర్ణానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయాలని భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్‌ఏ) కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలె క్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌సలో కమిషనర్ మాట్లాడారు. రెవెన్యూ రికార్డులను రైతుల ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లను అభినందించారు.
పభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 7,741 ఎకరాలు, పట్టణప్రాంతాల్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించామని, వీటి పరిరక్షణకు ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏడో విడతలో 8,744 ఎకరాల భూ పంపిణీకి సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, అనంతపురం, కదిరి, కళ్యాణదుర్గం ఆర్డీఓలు హుస్సేన్‌సాబ్, రాజశేఖర్, మలోలా, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు.