ఎన్నికల డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలను డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో ఆయన ప్రాంతీయ సమీక్షాసమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత కేసులు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ 5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
8వేల 900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వరం పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తుది నివేదికలను ఎన్నికల సంఘానికి సత్వరమే పంపాలన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్‌పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.