కీలు బొమ్మలు | The government, | Sakshi
Sakshi News home page

కీలు బొమ్మలు

Published Tue, Sep 9 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

కీలు బొమ్మలు

కీలు బొమ్మలు

  •  చెప్పుచేతల్లో ఉండేవారికే కీలక కుర్చీలు
  •   ఇప్పటికే డ్వామా పీడీ బదిలీ
  •   ఆయన స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే భార్య
  •   అధికారుల బదిలీలకు టీడీపీ నేతల కసరత్తు
  • విజయవాడ : సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ విధంగా ఆదేశించడంతో దాన్ని ఇక్కడ  ‘తమ్ముళ్లు’ పాటిస్తున్నారు. భవిష్యత్తులో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను కీలక కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు తాము చెప్పినట్టు వినే వారినే నియమించేలా పావులు కదుపుతున్నారు. మాట వినని అధికారులకు బదిలీలను బహుమానంగా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం డ్వామా పీడీ అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
     
    ‘ఉపాధి’ కోసమేనా..!

    సార్వత్రిక ఎన్నికల ముందు డ్వామా పీడీగా అనిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కోట్లాది రూపాయలతో నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి డ్వామా పీడీ తమకు అనుకూలంగా ఉంటే సులభంగా ‘ఉపాధి’ లభిస్తుందని తమ్ముళ్లు భావించి అనిల్‌కుమార్‌ను బలవంతంగా బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో  గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సతీమణి మాధవీలతను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టు కోసం కొందరు రాజకీయంగా పైరవీలు చేసినా, మాధవీ లతను నియమించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. నందిగామ ఉపఎన్నిక వల్ల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వులు జారీ చేయలేదని సమాచారం. కోడ్ ముగిసిన వెంటనే ఆమెను నియమిస్తారని సమాచారం. మాధవీలత గతంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణిగా పనిచేశారు.
     
    డీపీవో పోస్టుపై కూడా పైరవీలు
     
    ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి పోస్టు కోసం కూడా పైరవీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇన్‌చార్జి డీపీవోగా డీఆర్‌డీఏ ఏపీడీ చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. డీపీవో పోస్టు కోసం కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నలుగురు అధికారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎల్‌పీవోలు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మరో ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా నేతలు మాత్రం తమకు అనుకూలమైనవారిని ఈ సీటులో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.
     
    సర్వశిక్ష అభియాన్ పీడీ పోస్టుపై బేరసారాలు
     
    సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు కోసం బేరసారాలు సాగుతున్నాయి. ఖాళీగా ఉన్న ఈ పోస్టు కోసం కూడా నలుగురు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి పీడీగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పమణి వ్యవహరిస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన కొందరు లక్షలాది రూపాయలు లంచం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం. మరికొందరు అధి కార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం జిల్లా స్థాయి అధికారులతోపాటు మండల కేంద్రాల్లో పనిచేసే తహశీల్దార్లు, ఎంపీడీవోలు కూడా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నియమించేలా జాబితాలు సిద్ధం చేసినట్లు తెలిసింది.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement