documentation
-
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్‌లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
డూప్లికేట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం..సెబీ
న్యూఢిల్లీ: డూప్లికేట్ (నకలు) సెక్యూరిటీ సర్టిఫికెట్ల జారీకి అనుసరించే విధానం, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది. సెక్యూరిటీ సర్టిఫికెట్ల నకలు కోరేవారు అందుకు సమర్పించాల్సిన పత్రాలతో జాబితాను సెబీ ప్రకటించింది. ప్రస్తుతం డూప్లికేట్ సెక్యూరిటీల సర్టిఫికెట్ల జారీకి రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏలు) అనుసరిస్తున్న విధానాన్ని సెబీ సమీక్షించింది. ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. డూప్లికేట్ సర్టిఫికెట్ కోరేవారు ఎఫ్ఐఆర్ కాపీ (ఈ–ఎఫ్ఐఆర్ కూడా) ఒరిజినల్ సెక్యూరిటీల ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్, సర్టిఫికెట్ నంబర్ల వివరాలను ఆర్టీఏలకు సమర్పించాలి. సెక్యూరిటీలు పోగొట్టుకున్నట్టు తెలియజేస్తూ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇవ్వాలి. అఫిడవిట్, ఇంటెమ్నిటీ బాండ్‌ను నిర్దేశిత విధానంలో సమర్పించాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎటువంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ దరఖాస్తు సమర్పించే నాటికి పోగొట్టుకున్న సెక్యూరిటీల విలువ రూ.5 లక్షకు మించకపోతే ఇవేవీ అవసరం లేదని సెబీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకవేళ షేర్ సర్టిఫికెట్ నంబర్, ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్ ఇవేవీ లేకపోతే ఆర్టీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంతకం రికార్డులతో సరిపోలితే ఆర్టీఏ ఈ వివరాలను సెక్యూరిటీ హోల్డర్‌కు ఇవ్వాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిపోలేకపోతే అప్పుడు కేవైసీ వివరాలతో సెక్యూరిటీ హోల్డర్ తన గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత వివరాలు పొందాల్సి ఉంటుందని తెలిపింది. -
‘కూచిపూడి’ని కాపాడాలని...
ఢిల్లీ సంస్థ ఆధ్వర్యంలో భామా కలాపాం షూటింగ్ కూచిపూడి : అంతరించిపోతున్న కళలను కాపాడడానికి, అలాగే భావితరాలకు అందచేయటానికి ఢిల్లీకి చెందిన న్యూస్ వరల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశంలోని 15 పురాతన కళలపై డాక్యుమెంటేషన్, కాఫీ టేబుల్‌బుక్ ప్రచరణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు రమణ్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కూచిపూడి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో 14వ శతాబ్ధంలోని సిద్ధేంద్రుడు రచించిన భామా కలాపం నృత్యరూపకాన్ని డాక్యుమెంటేషన్ రూపంలో నిర్మిస్తున్నారు. ఇందులో బిస్మిల్లా ఖాన్యువ పురస్కార అవార్డు గ్రహీత వేదాంతం వెంకట నాగ చెలపతి సత్యభామగా, సూత్రధారునిగా పసుమర్తి రత్తయ్య శర్మ ప్రదర్శించారు. వీరికి పసుమర్తి హరినాధ శర్మ హరినాధ శాస్త్రి మృదంగంపై, పాలపర్తి అంజనేయులు వయోలిన్ పై, పసుమర్తి పాపని ఆత్రంతో సహకరించారు. -
సహకారం.. ఫెయిల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పనితీరు ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సంఘాలకు గ్రేడింగ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేడింగ్‌లో ప్రతిభ ఆధారంగా మూలధనం ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం. రుణాల మంజూరు, వసూలు, డాక్యుమెంటేషన్, ఫైళ్ల నిర్వహణ, సొంతంగా చేపట్టిన వ్యాపారాలు, నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రే డింగ్ ఇచ్చారు. ఆడిట్ నివేదికల ఆధారంగా ఇచ్చిన గ్రేడింగ్‌లో జిల్లాలో మెజారిటీ పీఏసీఎస్‌లు అత్తెసరు పనితీరును కనబరుస్తున్నట్లు వెల్లడైంది. ఏ ప్లస్, ఏ, బీ ప్లస్, బీ, సీ ప్లస్, సీ, డీ కేటగిరీలుగా సంఘాలను విభజిస్తూ గ్రేడింగ్ ఇచ్చారు. జిల్లాలో ఏ ఒక్క పీఏసీఎస్కూ ఏ ప్లస్, ఏ కేటగిరీల్లో చోటుదక్కలేదు. కేవలం కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే బీ ప్లస్ గ్రేడ్ జాబితాలో చోటు చేసుకున్నాయి. మెజారిటీ సొసైటీలు బీ, సీ ప్లస్, సీ కేటగిరీలకు మాత్రమే పరిమితమయ్యాయి. తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీ గ్రేడ్‌లో వున్నాయి. మహబూబ్‌నగర్, కోటకదిర, మల్లెబోయినపల్లి, షాద్‌నగర్, నాగర్‌కర్నూలు, తాడూరు, గోపాలపేట, గన్యాగుల, ఆలంపూర్ ప్రాథమిక సహకార సంఘాలు డీ గ్రేడ్‌కు పరిమితమయ్యాయి. కార్యకలాపాలు లేకపోవడం వల్లే.. పాలక మండళ్లు సరైన రీతిలో సొసైటీ కార్యకలాపాలు నిర్వర్తించక పోవడం, రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక పోవడంతో సొసైటీలు రైతులకు దూరమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రుణ వితరణలో పారదర్శకత పాటించక పోవడం, వసూళ్లు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలు కూడా సొసైటీల పనితీరు నాసిరకంగా వుండేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రేడింగ్ మూలంగా ప్రభుత్వం నుంచే అందే సాయం దక్కకుండా పోతుందని సొసైటీల ఛైర్మన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార స్ఫూర్తిని కొనసాగిస్తూ లాభాల బాటలో పయనించే సొసైటీలు మాత్రం పోటీతత్వం ఉంటేనే రాణిస్తామని చెప్తున్నాయి. గ్రేడింగ్ పరంగా మెరుగ్గా ఉన్న సొసైటీలను పరిశీలిస్తే సొంతంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకంతో పాటు రుణాల వసూలు శాతం ఎక్కువగా ఉంటోంది. కేవలం రుణాల మంజూరు, వసూలుపై ఆధార పడిన సొసైటీలు సరైన లాభాలు లేక గ్రేడింగ్‌లో అట్టడుగు స్థానానికి పడిపోయాయి. జిల్లాలో 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 2013-14లో రూ.26.19 కోట్ల విలువ చేసే 1.81 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. మరో 14 పీఏసీఎస్‌లు రూ.71.35 లక్షల విలువ చేసే 5.44 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి లాభాల బాటలో పయనించాయి. లాభాల బాటలో కల్వకుర్తి సొసైటీ జిల్లాలో బీ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్న సొసైటీల్లో కల్వకుర్తి ఒకటి. 8,500 మంది రైతులు సభ్యులుగా ఉన్న సొసైటీ ఏటా రూ.50 కోట్ల మేర టర్నోవర్ కలిగి ఉంది. రూ.34 కోట్ల మేర రుణాల రికవరీ ఉండగా, సొంతంగా వ్యాపారాలు చేస్తుండడంతో మెరుగైన పనితీరు కనబరిచింది. అట్టడుగున తాడూరు సొసైటీ జిల్లాలో అట్టడుగు పనితీరును కనబరిచిన తొమ్మిది సొసైటీల్లో తాడూరు ఒకటి. 4,200మంది సభ్యులున్న సొసైటీ ఏటా రూ.7 కోట్ల మేర లావాదేవీలు నిర్వర్తిస్తోంది. రూ.6.50 కోట్లు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలకు రైతులకు అందిస్తోంది. స్వల్పకాలిక రుణాల రికవరీ 99శాతం నమోదైనా రీషెడ్యూలుకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు సొసైటీ ఎలాంటి అదనపు కార్యక్రమాలు తీసుకోకపోవడంతో డీ గ్రేడ్‌లో నిలిచింది. పోటీతత్వంతోనే ముందుకు పీఏసీఎస్‌లో గ్రేడింగ్ విధానంతో రుణాలు ఇవ్వడంలో రికవరీలో పోటీతత్వం పెరుగుతుంది. ఏ గ్రేడ్‌లో పీఏసీఎస్ ఉంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. సబ్సిడీ రుణాలు, పీఏసీఎస్ నుంచి ఇచ్చే రుణ పరిమితి గానీ పెరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఉప్పునుంతల పీఏసీఎస్ జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. ఈ ఏడాది ఏ గ్రేడ్‌కు రావచ్చని అనుకుంటున్నాం. - మడ్డు నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, ఉప్పునుంతల -
ఎన్నికల డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలను డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో ఆయన ప్రాంతీయ సమీక్షాసమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత కేసులు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ 5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8వేల 900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వరం పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తుది నివేదికలను ఎన్నికల సంఘానికి సత్వరమే పంపాలన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్‌పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు బదిలీ గందరగోళం!
పలమనేరు, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన నగదు బదలీ కార్యక్రమం పలమనేరులో గందరగోళంగా మారింది. ఇప్పటికే ఈ నగదు బదిలీ అమలులోకి రావడంతో కొందరి ఖాతాల్లోకి మాత్రమే గ్యాస్‌కు సంబంధించిన సబ్సిడీ జమ అవుతోంది. అన్నీ సక్రమంగా డాక్యుమెంటేషన్ చేసినా చాలామంది ఖాతాల్లోకి సబ్సిడీ పడడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో ఈ సబ్సిడీ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి సైతం వెళ్తోంది. ఇలాఉండగా కొందరు బ్యాంకర్లు డీఫాల్ట్ ఖాతాల్లోని నగదును లబ్ధిదారుకు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆధార్ అనుసంధానానికి బ్యాంకర్లు అడ్డుపుల్ల వేస్తున్నారు. పలమనేరు పట్టణం, మండలానికి సంబంధించి 90 వేల దాకా ఆధార్ కార్డుల ప్రక్రియ మూడు నెలలక్రితమే పూర్తయ్యింది. వీరిలో 40వేల మందికి పైగా గ్యాస్ వినియోగదారులున్నారు. గ్యాస్ సబ్సీడీ రూ.420 సంబంధిత వినియోగదారు ఖాతాలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నగదు చాలా మందికి రాలేదు. ఇతరుల చేతుల్లోకి సబ్సిడీ నగదు ఇలా ఉండగా పట్టణంలో దాదాపు 12 వేల మంది దాకా వివిధ రకాల పింఛన్లు పొందే లబ్ధిదారులున్నారు. వీరిలో 6వేలమందికి గ్యాస్ కనెక్షన్లున్నాయి. దీంతో వీరంతా గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఆధార్‌ను అనుసంధానం చేయించుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో వీరు ఇప్పటికే సామాజిక పింఛన్లు పొందుతున్న యాక్సెస్ బ్యాంక్ ఖాతా నెంబర్లను గ్యాస్ సబ్సిడీకి అనుసంధానం చేశారు. దీంతో వీరి గ్యాస్ సబ్సిడీ చిత్తూరులోని బ్రాంచ్‌కు వెళ్తోంది. అయితే సామాజిక పింఛన్లను పలమనేరులో పంపిణీచేసే ఫినో అనే ప్రైవేటు సంస్థ గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని సైతం పంపిణీ చేస్తోంది. ఇదేమని అడిగితే యాక్సెస్ బ్యాంకు ఖాతాల్లోకే గ్యాస్ సబ్సిడీ పడుతోందని దీంతో తమ పింఛన్ల డబ్బుతో పాటు ఈ నగదు కూడా జమ అయ్యింది కాబట్టే తాము గ్యాస్ సబ్సిడీని అందజేస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ (పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కన్సెంట్) తారక్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా పట్టణంలోని కొందరు ప్రైవేటు ఏజెంట్లు యాక్సెస్ బ్యాంకు నుంచి గ్యాస్ సబ్సిడీని పింఛన్లు పొందే లబ్ధిదారులకు అందజేస్తున్న మాట వాస్తవమేనన్నారు. మొండిబకాయిలకు సబ్సిడీని జమ చేస్తున్న బ్యాంకర్లు ఇలా ఉండగా పలు బ్యాంకుల్లో మొండి బకాయిదారులుగా ఉన్న వారికి బ్యాంకు నుంచి గ్యాస్ సబ్సిడీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సబ్సిడీగా వచ్చే రూ.420ను సైతం బ్యాం కర్లు అప్పుకు జమ వేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. బకాయిలున్నవారు పూర్తిగా అప్పు చెల్లిస్తే గానీ ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయమని బ్యాకర్లు చెబుతున్నారు. ఈ విషయంపై పలమనేరు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వేణుగోపాల్రావ్ను న్యూస్‌లైన్ వివరణ కోరగా గ్యాస్ సబ్సిడీ పూర్తిగా తమస్థాయిలో జరగదు కాబట్టి తమకు సంబంధం లేదన్నారు. ఇక అప్పులకు సబ్సిడీని పట్టుకోవడం, ఆధార్ అనుసంధానానికి అప్పుల గురించి ప్రస్తావించడం తప్పని, బాధితులెవరైనా ఉంటే లీడ్‌బ్యాంక్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. గ్యాస్ సబ్సిడీ రాలే రెండు నెలల క్రితం గ్యాస్ సిలిండర్ కోసం రూ.940 కట్టినా. నాతో పాటు కట్టిన వాళ్ల లో కొందరికి వారి ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి. మరి నాకెందుకో ఇంకా రాలే. బ్యాంకోళ్లనడిగితే మాకు తెలీదంటారు. గ్యాసోళ్లను అడిగితే మాకు సంబంధం లేదంటారు. ఈ నెలలో మళ్లీ రూ.940 పెట్టి గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిని నమ్ముకున్నా. -పర్వీన్, కంసలవీధి, పలమనేరు అప్పు కడితేనే ఆధార్ అనుసంధానమట నా భార్య గ్రూపులో సభ్యురాలు. దాంతో మేము మగళ్లంతా కలసి సాయినాథ్ జేఎల్‌జీ పేరిట గ్రామీణ బ్యాంకులో లోను తీసుకున్నాం. నా అప్పు నేను కట్టేసినా. అయితే నాతోపాటు నా గ్రూపులోని కొందరు అప్పు కట్టలేదని నాకు ఆధార్ కార్డు అనుసంధానం చేసేదిలేదంటూ మేనేజర్ చెప్పాడు. ఇదెక్కడి న్యాయం. -జాకీర్. ఆటోడ్రైవర్ ఫించన్లతో పాటు గ్యాస్ సబ్సిడీ కొందరికిచ్చినారు నేను ప్రతినెలా రూ.500 ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటా. నా పేరిటిలోనే గ్యాస్ కూడా ఉంది. దానికి కావాల్సిన వివరాలంతా గ్యాస్ వాళ్లకు, బ్యాంకుకు ఇచ్చినా. నాతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్లకంతా ఇళ్ల వద్దకే తెచ్చి మాకు పెన్షన్లు ఇచ్చే మేడమ్ పంచతా ఉంది. నాకు మాత్రం గ్యాస్ సబ్సిడీ రాలేదు. ఎవరికి చెప్పుకోవాలో ఏమో అర్ధం కాలేదు. -నారాయణరెడ్డి, మారెమ్మ గుడి వీధి, పలమనేరు