పలమనేరు, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన నగదు బదలీ కార్యక్రమం పలమనేరులో గందరగోళంగా మారింది. ఇప్పటికే ఈ నగదు బదిలీ అమలులోకి రావడంతో కొందరి ఖాతాల్లోకి మాత్రమే గ్యాస్‌కు సంబంధించిన సబ్సిడీ జమ అవుతోంది. అన్నీ సక్రమంగా డాక్యుమెంటేషన్ చేసినా చాలామంది ఖాతాల్లోకి సబ్సిడీ పడడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో ఈ సబ్సిడీ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి సైతం వెళ్తోంది.
ఇలాఉండగా కొందరు బ్యాంకర్లు డీఫాల్ట్ ఖాతాల్లోని నగదును లబ్ధిదారుకు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆధార్ అనుసంధానానికి బ్యాంకర్లు అడ్డుపుల్ల వేస్తున్నారు. పలమనేరు పట్టణం, మండలానికి సంబంధించి 90 వేల దాకా ఆధార్ కార్డుల ప్రక్రియ మూడు నెలలక్రితమే పూర్తయ్యింది. వీరిలో 40వేల మందికి పైగా గ్యాస్ వినియోగదారులున్నారు. గ్యాస్ సబ్సీడీ రూ.420 సంబంధిత వినియోగదారు ఖాతాలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నగదు చాలా మందికి రాలేదు.
ఇతరుల చేతుల్లోకి సబ్సిడీ నగదు
ఇలా ఉండగా పట్టణంలో దాదాపు 12 వేల మంది దాకా వివిధ రకాల పింఛన్లు పొందే లబ్ధిదారులున్నారు. వీరిలో 6వేలమందికి గ్యాస్ కనెక్షన్లున్నాయి. దీంతో వీరంతా గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఆధార్‌ను అనుసంధానం చేయించుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో వీరు ఇప్పటికే సామాజిక పింఛన్లు పొందుతున్న యాక్సెస్ బ్యాంక్ ఖాతా నెంబర్లను గ్యాస్ సబ్సిడీకి అనుసంధానం చేశారు. దీంతో వీరి గ్యాస్ సబ్సిడీ చిత్తూరులోని బ్రాంచ్‌కు వెళ్తోంది. అయితే సామాజిక పింఛన్లను పలమనేరులో పంపిణీచేసే ఫినో అనే ప్రైవేటు సంస్థ గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని సైతం పంపిణీ చేస్తోంది.
ఇదేమని అడిగితే యాక్సెస్ బ్యాంకు ఖాతాల్లోకే గ్యాస్ సబ్సిడీ పడుతోందని దీంతో తమ పింఛన్ల డబ్బుతో పాటు ఈ నగదు కూడా జమ అయ్యింది కాబట్టే తాము గ్యాస్ సబ్సిడీని అందజేస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ (పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కన్సెంట్) తారక్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా పట్టణంలోని కొందరు ప్రైవేటు ఏజెంట్లు యాక్సెస్ బ్యాంకు నుంచి గ్యాస్ సబ్సిడీని పింఛన్లు పొందే లబ్ధిదారులకు అందజేస్తున్న మాట వాస్తవమేనన్నారు.
మొండిబకాయిలకు సబ్సిడీని జమ చేస్తున్న బ్యాంకర్లు
ఇలా ఉండగా పలు బ్యాంకుల్లో మొండి బకాయిదారులుగా ఉన్న వారికి బ్యాంకు నుంచి గ్యాస్ సబ్సిడీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సబ్సిడీగా వచ్చే రూ.420ను సైతం బ్యాం కర్లు అప్పుకు జమ వేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. బకాయిలున్నవారు పూర్తిగా అప్పు చెల్లిస్తే గానీ ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయమని బ్యాకర్లు చెబుతున్నారు. ఈ విషయంపై పలమనేరు ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ వేణుగోపాల్‌రావ్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా గ్యాస్ సబ్సిడీ పూర్తిగా తమస్థాయిలో జరగదు కాబట్టి తమకు సంబంధం లేదన్నారు. ఇక అప్పులకు సబ్సిడీని పట్టుకోవడం, ఆధార్ అనుసంధానానికి అప్పుల గురించి ప్రస్తావించడం తప్పని, బాధితులెవరైనా ఉంటే లీడ్‌బ్యాంక్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
గ్యాస్ సబ్సిడీ రాలే
రెండు నెలల క్రితం గ్యాస్ సిలిండర్ కోసం రూ.940 కట్టినా. నాతో పాటు కట్టిన వాళ్ల లో కొందరికి వారి ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి. మరి నాకెందుకో ఇంకా రాలే. బ్యాంకోళ్లనడిగితే మాకు తెలీదంటారు. గ్యాసోళ్లను అడిగితే మాకు సంబంధం లేదంటారు. ఈ నెలలో మళ్లీ రూ.940 పెట్టి గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిని నమ్ముకున్నా. -పర్వీన్, కంసలవీధి, పలమనేరు
అప్పు కడితేనే ఆధార్ అనుసంధానమట
నా భార్య గ్రూపులో సభ్యురాలు. దాంతో మేము మగళ్లంతా కలసి సాయినాథ్ జేఎల్‌జీ పేరిట గ్రామీణ బ్యాంకులో లోను తీసుకున్నాం. నా అప్పు నేను కట్టేసినా. అయితే నాతోపాటు నా గ్రూపులోని కొందరు అప్పు కట్టలేదని నాకు ఆధార్ కార్డు అనుసంధానం చేసేదిలేదంటూ మేనేజర్ చెప్పాడు. ఇదెక్కడి న్యాయం.
-జాకీర్. ఆటోడ్రైవర్
ఫించన్లతో పాటు గ్యాస్ సబ్సిడీ కొందరికిచ్చినారు
నేను ప్రతినెలా రూ.500 ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటా. నా పేరిటిలోనే గ్యాస్ కూడా ఉంది. దానికి కావాల్సిన వివరాలంతా గ్యాస్ వాళ్లకు, బ్యాంకుకు ఇచ్చినా. నాతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్లకంతా ఇళ్ల వద్దకే తెచ్చి మాకు పెన్షన్లు ఇచ్చే మేడమ్ పంచతా ఉంది. నాకు మాత్రం గ్యాస్ సబ్సిడీ రాలేదు. ఎవరికి చెప్పుకోవాలో ఏమో అర్ధం కాలేదు.
-నారాయణరెడ్డి, మారెమ్మ గుడి వీధి, పలమనేరు
నగదు బదిలీ గందరగోళం!
Published Fri, Sep 6 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement