సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పనితీరు ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సంఘాలకు గ్రేడింగ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేడింగ్‌లో ప్రతిభ ఆధారంగా మూలధనం ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం. రుణాల మంజూరు, వసూలు, డాక్యుమెంటేషన్, ఫైళ్ల నిర్వహణ, సొంతంగా చేపట్టిన వ్యాపారాలు, నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రే డింగ్ ఇచ్చారు. ఆడిట్ నివేదికల ఆధారంగా ఇచ్చిన గ్రేడింగ్‌లో జిల్లాలో మెజారిటీ పీఏసీఎస్‌లు అత్తెసరు పనితీరును కనబరుస్తున్నట్లు వెల్లడైంది. ఏ ప్లస్, ఏ, బీ ప్లస్, బీ, సీ ప్లస్, సీ, డీ కేటగిరీలుగా సంఘాలను విభజిస్తూ గ్రేడింగ్ ఇచ్చారు.
జిల్లాలో ఏ ఒక్క పీఏసీఎస్‌కూ ఏ ప్లస్, ఏ కేటగిరీల్లో చోటుదక్కలేదు. కేవలం కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే బీ ప్లస్ గ్రేడ్ జాబితాలో చోటు చేసుకున్నాయి. మెజారిటీ సొసైటీలు బీ, సీ ప్లస్, సీ కేటగిరీలకు మాత్రమే పరిమితమయ్యాయి. తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీ గ్రేడ్‌లో వున్నాయి. మహబూబ్‌నగర్, కోటకదిర, మల్లెబోయినపల్లి, షాద్‌నగర్, నాగర్‌కర్నూలు, తాడూరు, గోపాలపేట, గన్యాగుల, ఆలంపూర్ ప్రాథమిక సహకార సంఘాలు డీ గ్రేడ్‌కు పరిమితమయ్యాయి.
కార్యకలాపాలు లేకపోవడం వల్లే..
పాలక మండళ్లు సరైన రీతిలో సొసైటీ కార్యకలాపాలు నిర్వర్తించక పోవడం, రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక పోవడంతో సొసైటీలు రైతులకు దూరమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రుణ వితరణలో పారదర్శకత పాటించక పోవడం, వసూళ్లు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలు కూడా సొసైటీల పనితీరు నాసిరకంగా వుండేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
గ్రేడింగ్ మూలంగా ప్రభుత్వం నుంచే అందే సాయం దక్కకుండా పోతుందని సొసైటీల ఛైర్మన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార స్ఫూర్తిని కొనసాగిస్తూ లాభాల బాటలో పయనించే సొసైటీలు మాత్రం పోటీతత్వం ఉంటేనే రాణిస్తామని చెప్తున్నాయి. గ్రేడింగ్ పరంగా మెరుగ్గా ఉన్న సొసైటీలను పరిశీలిస్తే సొంతంగా ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకంతో పాటు రుణాల వసూలు శాతం ఎక్కువగా ఉంటోంది. కేవలం రుణాల మంజూరు, వసూలుపై ఆధార పడిన సొసైటీలు సరైన లాభాలు లేక గ్రేడింగ్‌లో అట్టడుగు స్థానానికి పడిపోయాయి. జిల్లాలో 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 2013-14లో రూ.26.19 కోట్ల విలువ చేసే 1.81 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. మరో 14 పీఏసీఎస్‌లు రూ.71.35 లక్షల విలువ చేసే 5.44 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి లాభాల బాటలో పయనించాయి.
లాభాల బాటలో కల్వకుర్తి సొసైటీ
జిల్లాలో బీ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్న సొసైటీల్లో కల్వకుర్తి ఒకటి. 8,500 మంది రైతులు సభ్యులుగా ఉన్న సొసైటీ ఏటా రూ.50 కోట్ల మేర టర్నోవర్ కలిగి ఉంది. రూ.34 కోట్ల మేర రుణాల రికవరీ ఉండగా, సొంతంగా వ్యాపారాలు చేస్తుండడంతో మెరుగైన పనితీరు కనబరిచింది.
అట్టడుగున తాడూరు సొసైటీ
జిల్లాలో అట్టడుగు పనితీరును కనబరిచిన తొమ్మిది సొసైటీల్లో తాడూరు ఒకటి. 4,200మంది సభ్యులున్న సొసైటీ ఏటా రూ.7 కోట్ల మేర లావాదేవీలు నిర్వర్తిస్తోంది. రూ.6.50 కోట్లు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలకు రైతులకు అందిస్తోంది. స్వల్పకాలిక రుణాల రికవరీ 99శాతం నమోదైనా రీషెడ్యూలుకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు సొసైటీ ఎలాంటి అదనపు కార్యక్రమాలు తీసుకోకపోవడంతో డీ గ్రేడ్‌లో నిలిచింది.
పోటీతత్వంతోనే ముందుకు
పీఏసీఎస్‌లో గ్రేడింగ్ విధానంతో రుణాలు ఇవ్వడంలో రికవరీలో పోటీతత్వం పెరుగుతుంది. ఏ గ్రేడ్‌లో పీఏసీఎస్ ఉంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. సబ్సిడీ రుణాలు, పీఏసీఎస్ నుంచి ఇచ్చే రుణ పరిమితి గానీ పెరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఉప్పునుంతల పీఏసీఎస్ జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. ఈ ఏడాది ఏ గ్రేడ్‌కు రావచ్చని అనుకుంటున్నాం.
- మడ్డు నరేందర్‌రెడ్డి,
పీఏసీఎస్ చైర్మన్, ఉప్పునుంతల
సహకారం.. ఫెయిల్
Published Mon, Apr 20 2015 2:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement