రాతి ఇసుకతో ‘పాలమూరు’
♦ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
♦ వాడకానికి ఎన్‌ఎస్‌ఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆమోదం
♦ మహబూబ్‌నగర్ జిల్లాలో లభ్యత ప్రాంతాల గుర్తింపు
♦ కోటి క్యూబిక్ మీటర్ల రాతి ఇసుక అవసరమని అంచనా
సాక్షి, హైదరాబాద్: భారీ వ్యయంతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు రాతి ఇసుక (రాక్‌శాండ్)ను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నదుల్లో లభించే సహజ ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు దెబ్బతింటున్నందున రాక్‌శాండ్‌కు ప్రాధాన్యమివ్వాలని, నిర్మాణాల్లో దీన్నే వినియోగించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మొత్తంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర రాక్‌శాండ్ అవసరాలు ఉంటాయని ఇప్పటికే లెక్కలేసిన అధికారులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక లభ్యత సమృధ్ధిగా ఉన్న ప్రదేశాలను సైతం గుర్తించారు. రాక్‌శాండ్ వినియోగంపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) సైతం ఆమోదం తెలిపినట్లుగా నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
నదుల్లో ఇసుక తగినంత లేకనే...
రూ. 35,200 కోట్లతో ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు (నార్లాపూర్ 8.1 టీఎంసీలు, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్ధండాపూర్ 9.2 టీఎంసీలు) నిర్మించనుండగా వీటికోసం మొత్తంగా రూ.9,644 కోట్లతో అంచనాలు సైతం సిధ్ధమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి బ్యారేజీల మధ్య అంతారం వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు ఓపెన్ చానల్, టన్నెళ్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి, రిజర్వాయర్‌లలో లీకేజీల్లేకుండా నీటిని తరలించేందుకు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉంటాయని లెక్కించారు.
అయితే నదుల్లో ఆ స్థాయిలో ఇసుక లభ్యత ఉండకపోవడం, పాత ప్రాజెక్టుల కే ఇసుక లభ్యత లేక నిర్మాణాల్లో జాప్యం జరుగుతున్న దృష్ట్యా రాతి ఇసుకను వాడాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ఈ తరహా ఇసుకను ఇదివరకు ఎన్నడూ ప్రాజెక్టుల్లో వినియోగించనందున దీని వాడకాన్ని సీఎస్‌ఎంఆర్‌ఎస్ పరిశీలించి ఇందుకు ఆమోదించినట్లు తెలిసింది. మరోవైపు లీకేజీలు రాకుండా కోర్ (నీటిని పోనివ్వకుండా ఆపే నిర్మాణాలు)లలో 4 కోట్ల క్యూబిక్ మీటర్ల నల్లమట్టి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ అవసరాలకు మూడురెట్ల నల్లమట్టి మహబూబ్‌నగర్ జిల్లాలోనే సమృద్ధిగా ఉందని, ఆ ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
భూసేకరణకు మరో రూ. 150 కోట్లు..
పాలమూరు ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మొత్తంగా 20,884 ఎకరాల సేకరణకుగాను ఇప్పటివరకు సుమారు 8,500 ఎకరాల మేర సేకరణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. దీనికోసం రూ. 470 కోట్లు కేటాయించగా, అందులో రూ. 380 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మరో 12,500 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు మొదలుపెట్టే అవకాశం ఉన్నందున ఆలోగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించింది. దీనికోసం మరో రూ.150 కోట్లను కేటాయించనుంది.