బాదేపల్లి మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన మొక్కజొన్న
ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,700గా మద్దతు ధర ప్రకటించింది. కానీ బాదేపల్లి మార్కెట్‌లో క్వింటా ధర గరిష్టంగా రూ.1,404 దాటకపోగా.. కనిష్టంగా రూ.1,051 మాత్రమే లభించింది. ఇక వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,750 నుంచి రూ.1,770 వరకు అందాల్సి ఉన్నా 1,650 దాటడం లేదు. సాగు వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మద్దతు దక్కేలా చూడాలని.. లేనిపక్షంలో ప్రభుత్వమే నేరుగా తమ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. వారి ఆశ ఈ ఏడాది ఫలిస్తుందో లేదంటే ఎప్పటిలాగే అరణ్యఘోషగానే మిగులుతుందో వేచి చూడాల్సిందే....
జడ్చర్ల : పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు అందడం లేదు. 2018–19 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నా అవి కూడా రైతులకు దక్కక పోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు మార్కెట్‌కు వస్తున్న వేళ దిగుబడులకు లబిస్తున్న ధరలను చూసి రైతులు నివ్వెరపోవాల్సి వస్తుంది. అసలే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను నష్టపోయిన రైతాంగం మార్కెట్‌లో లబిస్తున్న ధరలను చూసి ఖంగుతింటున్నారు. కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు దక్కుతాయని ఆశించిన వారికి తక్కువ ధరలు కేటాయిస్తుండడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
పెరిగిన సాగు వ్యయం
ఒక వైపు భారీగా పెరిగిన ఎరువుల ధరలతో పాటు రోజురోజు ఆకాశాన్ని తాకుతున్న డీజిల్, పెట్రోలు ధరలు రైతులను కుదేలు చేస్తున్నాయి. వీటికి తోడు పురుగు మందుల ధరలతో పాటు కూలీల
వ్యయం కూడా తడిసి మోపెడవుతోంది. ఇలాంటి కారణాలతో సాగు వ్యయం భారంగా మారింది. అయితే, సాగు వ్యయానికి తగ్గట్లుగా దిగుబడులు రాకపోవడం.. కాస్తోకూస్తో వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో రైతాంగం కుంగిపోతోంది. ఇక వంటగ్యాస్, నిత్యావసర ధరలు కంటికి కునుకు పట్టకుండా చేస్తున్న తరుణంలో పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను చూసిన రైతాంగం తీవ్ర అసహనానికి గురవుతోంది. దీంతో ఈ ఏడు కూడా రైతులకు గిట్టుబాటు ధరలు లభించే పరిస్థితులు కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. సాగు వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు దక్కుతాయని భావించిన రైతులకు మార్కెట్లలో నిరాశే ఎదురవుతోంది.
మక్కకు దక్కని మద్దతు
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధరలు దక్కడం లేదు. వారం, పది రోజులుగా యార్డుకు మొక్కజొన్న, తదితర పంట దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి. కానీ ఆయా దిగుబడులకు రైతాం గం ఆశించిన విధంగా మద్దతు ధరల జాడ కరువైంది. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా గరిష్టంగా క్వింటాకు రూ.1,770, కనిష్టంగా రూ.1,750 ధర అందాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ఇక మొక్కజొన్నకు సంబంధించి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,700 మద్దతు ధరగా నిర్ణయించగా ఆ ధరలు మచ్చుకైనా కానరావడం లేదు.
ధరలు ఇలా...
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఓ రోజు పరిశీలిస్తే... వివిధ ప్రాంతాల నుండి 2,095 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,404, కనిష్టంగా రూ.1,051 ధరలు లభించాయి. అదేవిధంగా హసం రకం ధాన్యానికి సంబంధించి గరిష్టంగా రూ.1,650, కనిష్టంగా రూ.1,556 ధర లభించింది. అలాగే, ఆముదాలకు గరిష్టంగా రూ.4,154, కనిష్టంగా రూ.2,924 ధర లభించడం గమనార్హం.
కొనుగోలు కేందాలతోనే లాభం
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రటించినా ఇప్పటి వరకు అడుగు వేయలేదు. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలను ఎక్కడా ప్రారంభించకపోవడంతో రైతులు తమ దిగుబడులను తక్కువధరలకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అదికారులు స్పందించి త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment