సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ (సెకండ్ గ్రేడ్ టీచర్లు) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం 2017లో నియామక పరీక్ష నిర్వహించగా ఇన్నాళ్లూ వివిధ కారణాలతో జాబితాను ప్రకటించడానికి కాలయాపన చేసింది. పలుమార్లు అభ్యర్థులు పెద్దఎత్తున జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించి పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. దీంతో అభ్యర్థుల ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది.
త్వరలో భర్తీ చేసే అవకాశం
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ఆధారంగా త్వరలోనే మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2017లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మొత్తం 1,979 ఉపాధ్యాయ పోస్టులకు గాను 2018 ఫిబ్రవరి, మార్చిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. దాదాపు 50వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాశారు.
ఐదు నెలల క్రితం 375 పోస్టులకు వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్‌లు, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులను, 42 కన్నడ, ఉర్దూ మీడియం మినహా మిగతా భాషలకు చెందిన ఉపాధ్యాయులను మూడు నెలల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి భర్తీ చేశారు. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాష ఎస్జీటీ ఉపాధ్యాయులకు సంబంధించి కోర్టులో వివాదం కొనసాగగా కొన్నిరోజుల తర్వాత ఈ సమస్య కూడా సద్దు మనిగింది. ప్రస్తుతం కేవలం తెలుగు, ఇంగ్లీష్ భాషకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు దాదాపు 1,020 మంది ఉన్నారు. వీరికి కూడా త్వరలోనే పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తీరనున్న ఉపాధ్యాయుల కొరత
కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఉమ్మడి జిల్లాలో 375, ఎస్జీటీ పోస్టులను గతంలో 42 మాత్రమే భర్తీ చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల సమస్య తీరలేదు. అయితే ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ‘సర్దుబాటు’ పేరుతో ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేసింది.
పాలమూరు జిల్లాలో దాదాపు 35 నుంచి 50 మంది వరకు ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో తాత్కాలిక డిప్యూటేషన్లు ఇచ్చారు. వీటితో పాటు మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొత్త ఉపాధ్యాయులు వచ్చే క్రమంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
అభ్యర్థుల్లో ఆనందం
ఆలస్యంగానైనా జాబితా విడుదల కావడంతో టీఆర్టీ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎంతో కాలంగా ప్రభుత్వ బడుల్లో బోధించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దసరా సెలువులు ముగిసే నాటికి టీచర్ల భర్తీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తుదిజాబితా వచ్చింది
ప్రభుత్వం కొన్ని రోజులుగా పెండింగ్‌లో పెట్టిన ఎస్జీటీల భర్తీకి సంబంధించిన తుది జాబితాను ప్రకటించింది. అయితే వీటి భర్తీకి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు షెడ్యూల్ నేడు వచ్చే అవకాశం ఉంది. అయితే మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు ఎంత మంది ఉపాధ్యాయులను కేటాయించారనే విషయంపై స్పష్టత ఇంకా రాలేదు.
– నాంపల్లి రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment