భూముల ధరలకు రెక్కలు!
► జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారి గుర్తింపుతో పెరిగిన ధరలు
► పాలమూరు ఎత్తిపోతలా కారణమే
► రూ.కోటిదాటిన ఎకరా ధర
► ఊపందుకున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారం
జడ్చర్ల: జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది.. జడ్చర్ల -కోదాడ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించడం, రోడ్డువిస్తరణ కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతభూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రక్రియ కూడా ఊపందుకోవడంతో కొన్నిరోజులుగా జడ్చర్ల కేంద్రంగా రియల్‌వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పొలాలు, ప్లాట్లధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌కు, ఇటు ఏపీకి దగ్గరగా ఉండడంతో పాటు 44వ నం. జాతీయ రహదారికి కొత్తగా ఆవిర్భావించే జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారి తోడవడంతో ఈ ప్రాంతభూముల ధరలకు డిమాండ్ పెరిగింది. అలాగే పోలేపల్లి సెజ్, తదితర పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో ఈ ప్రాంతం పారిశ్రామికరంగంలోనూ దూసుకెళ్తోంది.
భూముల ధరలు రెట్టింపు!
జడ్చర్ల నియోజవకర్గంలో ఎక్కడ చూసినా భూముల ధరలు రెట్టింపుఅయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎకరాకు కనీసంగా రూ.ఆరులక్షలు పలుకుతోంది. కొత్తగా ఏర్పడిన జాతీయ రహదారిని అనుసరించి రూ.60లక్షలు నుంచి కోటికి పైగా ఎకరాధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ రహదారిని అనుసరించి ఉన్న జడ్చర్ల -కల్వకుర్తి మార్గంలో భూముల ధరలు మరింత పెరిగాయి. మిడ్జిల్ వద్ద ఎకరా రూ.60లక్షలు పెట్టి రియల్ వ్యాపారులు కొనుగోలుచేసి ప్లాట్లుగా మార్చి మార్కెట్‌లో పెట్టారు. అదేవిధంగా జడ్చర్ల వద్ద రూ.1.30కోట్లుగా ఎకరా కొనుగోలుచేశారు. మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం కాల్వలతో పాటు ఉదండాపూర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తుండడంతో పంటపొలాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎకరాకు రూ.ఆరు నుంచి రూ.12లక్షల వరకు ధరలు పెరిగాయి.
రైతులకు భారమైన ధరలు
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు కొనుగోలుచేయడం భారంగా మారింది. ప్రభుత్వం రైతుల నుంచి ఎకరా భూమిని రూ.3.50 నుంచి రూ.5.50లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేస్తుండడం.. బయట అదేధరలకు భూములు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇంటిస్థలం ఖరీదు కూడా పెరగడంతో భూములు అమ్మిన సొమ్ముకు ప్లాటు రావడం లేదు. ఇప్పటికే జడ్చర్ల మండలంలోని ఆలూరు, బూర్గుపల్లి గ్రామాల శివారులో సుమారు 1400ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలో దాదాపు 1500ఎకరాలకు పైగానే సేకరించనుంది.