ధీమా కరువు!
- రుణ‘మాయ’ ఎఫెక్ట్
- పంటల బీమా అర్హత కోల్పోయిన సగానికి పైగా రైతులు
- వణికిస్తున్న ప్రకృతి విపత్తులు
- ‘హుదూద్’ గండం తప్పినా అన్నదాతలను వీడని ఆందోళన
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మిన జిల్లాలోని రైతుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన చెప్పినట్లు రుణమాఫీ జరగలేదు. కనీసం బ్యాంకుల నుంచి రైతులు ఖరీఫ్ సాగు కోసం రుణాలను సైతం పొందలేకపోయారు. ఇప్పుడు అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న పంటలకు కూడా బీమా భరోసా కరువైంది. హుదూద్ తుపాను నేపథ్యంలో పంటల బీమాకు అర్హత కోల్పోయినవారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం సాగు కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు.
ఈ మొత్తంలో కొంత నగదును పంటల బీమా కింద జమ చేసేవారు. కానీ, చంద్రబాబు మాటలు నమ్మిన ఎక్కువ మంది రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించి బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. దీంతో వారందరూ ఈ ఏడాది పంటల బీమాకు అర్హత కోల్పోయినట్టే. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకున్న కొందరికి మాత్రం బ్యాంకులు బీమాపై భరోసా ఇస్తున్నాయి.
ఈ సంవత్సరం ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణాలు ఇచ్చారనే విషయాన్ని చెప్పేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నిరాకరించారు. కానీ, కొన్ని బ్యాంకుల మేనేజర్లు మాత్రం పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని, దీంతో బీమా సదుపాయం కూడా ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించడంతో రైతులు మండిపడుతున్నారు.
2,20,120 మందికే అవకాశం..
జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల మంది రైతులకు రూ.3049.39 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3106.20 కోట్లను అందజేసి లక్ష్యాన్ని అధిగమించారు. పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం 5 శాతం చొప్పున మొత్తం రూ.155.31 కోట్లను బ్యాంకు అధికారులే మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాయి. కానీ, 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు రూ.3659.27 కోట్లను రుణాలుగా అందజేయాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు 2,20,120 మంది రైతులకు కేవలం రూ.1,206 కోట్లను మాత్రమే పంట రుణాలుగా ఇచ్చారు. వారికి ఇచ్చిన రుణాల్లో పంటల బీమా కోసం రూ.60.3 కోట్లు మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించారు. దీంతో సగానికిపైగా రైతులు పంటల బీమాను కోల్పోయారు. ప్రస్తుతానికి హుదూత్ తుపాను ముప్పు తప్పినా, నవంబరు వరకు విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి మంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏమిటని బీమాకు అర్హత కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి సాగు..
ఈ ఏడాది బ్యాంకుల ద్వారా సక్రమంగా రుణాలు అందకపోవడంతో రైతులు గ్రామాల్లోని ధాన్యం వ్యాపారుల వద్ద నూటికి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని 6.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆయిల్ ఇంజిన్లను అద్దెకు తెచ్చుకుని గంటకు రూ.250లు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. దీనికి డీజిల్ ఖర్చు అదనం. ఒకవైపు ఖర్చులు రెట్టింపు కావడం, మరోవైపు బీమా భరోసా కూడా లేకపోవడం రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది.