వెల్లువెత్తిన నిరసన
- జిల్లా అంతటా ‘నరకాసుర వధ’
- కదంతొక్కినవైఎస్సార్ సీపీ శ్రేణులు
- రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్
- సీఎం దిష్టిబొమ్మలు దహనం
విజయవాడ : ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీని అమలుచేయాలని డిమాండ్‌చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనబాట పట్టారు. తమ పార్టీకి ఓటేస్తే అన్ని రకాల రుణాలు మాఫీ చే స్తామని రైతులు, మహిళలను న మ్మించి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు మాటమార్చడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ గురువారం చేపట్టిన ‘నరకాసుర వధ’ కార్యక్రమం జిల్లా అంతటా పెద్ద ఎత్తున జరిగింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పలు చోట్ల ఆ పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహించారు. రైతులు, మహిళలు పాల్గొని సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. వెంటనే రైతులు, డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేయాలని నినాదాలు చేశారు.
పోలీసుల అండతో రెచ్చిపోయిన టీడీపీ
వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడంతో ఓర్వలేక పలు చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. విజయవాడ కేఎల్ రావునగర్, పామర్రు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ ఆందోళనలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. విజయవాడలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించి వైఎస్సార్ సీసీ నాయకులతో ఆందోళన విరమింపజేసి పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడే టీడీపీ నేతలు చేపట్టిన పోటీ నిరసన కార్యక్రమాన్ని మాత్రం పోలీసులు దగ్గరుండి జరిపించారు. దీంతో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను విడిపించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యాన ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
నూజివీడు చిన గాంధీబొమ్మ సెంటరులో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లోనూ నిరసనలు తెలిపారు.
తిరువూరు నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే రక్షణ నిధి పాల్గొన్నారు.
రుణాలన్నీ రద్దు చేయాలని నందిగామలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు.
అవనిగడ్డలో ప్రధాన రహదారిపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ నాయకత్వం వహించారు. చల్లపల్లిలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ముత్యాల వెంకటరత్నం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పామర్రులో టీడీపీ అరాచకం...
వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఆధ్వర్యాన పామార్రులోని నాలుగు రోడ్ల కూడలిలో చేపట్టిన ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు పామర్రు సెంటర్‌కు వెళుతుండగా టీడీపీ శ్రేణులు అరాచకం సృష్టించారు. టీడీపీ నేతలు పథకం ప్రకారం జెండాలు, కర్రలు చేతపట్టి రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనవసరంగా ఉద్రిక్త వాతావారణాన్ని సృష్టించి పోలీసుల సాయంతో వైఎస్సార్ సీపీ ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు.