రెండోరోజూ ‘నరకాసుర వధ’
విజయవాడ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన చేపట్టిన ‘నరకాసుర వధ’ రెండో రోజైన శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. పలు చోట్ల టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వగానే వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ తాము రైతులు, డ్వాక్రా మహిళల కోసం ఆందోళన చేస్తుండగా, టీడీపీ నాయకులు తమ పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఆరాటం పడుతూ పోలీసుల అండతో దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యాన జగ్గయ్యపేటలోని మున్సిపల్ సెంటర్‌లో భారీ ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో అన్ని రణాల రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అనేక షరతులు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నందిగామలో జాతీయ రహదారిపై ఆ పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యాన రాస్తారోకో చేశారు. నాగాయలంక సెంటర్‌లో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నాయకత్వంలో రుణాలు మాఫీ చేయాలని ధర్నా జరిపారు.
కూచిపూడిలో ఉద్రిక్తత.. స్వల్ప లాఠీచార్జ్
వెంటనే రుణమాఫీ అమలు చేయాలని రైతాంగానికి తిరిగి రుణాలు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన మొవ్వ మండలం కూచిపూడిలో చేపట్టిన ఆందోళనను భగ్నం చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా విఫల యత్నం చేశారు. దీంతో రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. కూచిపూడిలో వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తుందనే సమాచారంతో టీడీపీ స్థానిక నేతలు పోటీగా ఆందోళన చేపట్టారు.
వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు కూచిపూడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకదశలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకున్నారు. అనంతరం 144 సెక్షన్ విధించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు మధ్యలోనే ఆందోళనను విరమించారు.
టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే కల్పన ఫిర్యాదు
కూచిపూడి : శాంతియుతంగా ఆందోళన చేయటానికి వచ్చిన తనను దుర్భాషలాడి అడ్డుకున్నారని టీడీపీ నాయకులపై పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన శుక్రవారం రాత్రి కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో చల్లపల్లి సీఐ దుర్గారావుకు ఫిర్యాదుచేశారు. టీడీపీ మం డల అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట్రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నన్నపనేని వీరేంద్ర, టీడీపీ నాయకులు గుత్తికొండ పద్మ, పోతుల నాగదేవచంద్రహాస్, పేరుమోను గాంధీ, పోతుల జ్యోతీబస్, అన్నే రాంజేంద్రకుమార్‌పై ఆమె కేసు పెట్టారు. ఎమ్మెల్యే కల్పన వెంట వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కేపీ సారథి, పలువురు నాయకులు ఉన్నారు.