వైఎస్సార్ సీపీ ధర్నాను జయప్రదం చేయండి
గిద్దలూరు: రైతులు, మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 5న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక తన నివాస గృహంలో ఆయన ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా పోరాడతామన్నారు. బూటకపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులను, మహిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను నిలువునా మోసగించిందని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాల్ని చూస్తూ ఊరుకోబోమని..వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఆచరణ సాధ్యంకాని 200 హామీలను గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయని..కనీసం వడ్డీ మాఫీ పథకం అమలయ్యే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇప్పిస్తానని, లేదంటే నిరుద్యోగభృతి చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు వారి ఆశలు అడియాశలు చేశారన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రూ.102 లక్షల కోట్లు ఉన్నాయని, సంవత్సరానికి వడ్డీ రూ.14 లక్షలు వస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. పింఛను అర్హత పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కనీసం ప్రజాప్రతినిధులు కానివారిని నియమించారని, తద్వారా పచ్చచొక్కా వారికి పెత్తనం కట్టి అర్హులైన వారి పింఛన్లు తొలగించేలా చేశారన్నారు.
టీడీపీ నియంతృత్వ పాలన ఎక్కువ కాలం మనలేదని, ప్రజాగ్రహానికి గురై కొట్టుకుపోక తప్పదన్నారు. 5వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందన్నారు. ధర్నాలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు కే.హిమశేఖరరెడ్డి, మోపూరి బ్రహ్మం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దుగ్గా రామ్మోహన్‌రెడ్డి, నాయకులు షేక్ పెద్దభాషా, బిజ్జం వెంకటరామిరెడ్డి, గులాం చిన్నవీరయ్య, రాజశేఖర్, ఎన్.వి.సుబ్బారెడ్డి, సూరా పాండురంగారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.