కనిపించే కరువుమీద సర్కారు పరదా! | Lowest harvest is in 2017 compared to the last 10 years | Sakshi
Sakshi News home page

కనిపించే కరువుమీద సర్కారు పరదా!

Published Mon, Nov 20 2017 3:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Lowest harvest is in 2017 compared to the last 10 years - Sakshi - Sakshi

ఎక్కడైనా పంటల సాగు విస్తీర్ణం పడిపోయిందంటే ప్రధాన కారణం కరువు సంభవించటమే. వర్షాలు కురవక, నీరు లేక రైతన్నలు సాగు వదిలేస్తుంటారు. మన రాష్ట్రంలో మాత్రం సాగు విస్తీర్ణం గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయినా కరువు కంటికి కనిపించడం లేదట! కరువు మండలాలను ప్రకటించాల్సిన అవసరమే లేదని సాక్షాత్తూ ప్రభుత్వమే చెబుతోంది. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి తీరని అన్యాయం చేస్తోంది. దుర్భిక్షం రైతాంగాన్ని కాటేసినా సర్కారు కనికరం చూపడం లేదు. రైతులకు పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగవేసేందుకే ప్రభుత్వం కరువుపై తప్పుడు ప్రకటనలు చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కరువు ధాటికి పంటలు పండక, ప్రభుత్వం నుంచి పైసా కూడా సాయం అందక, సొంత ఊళ్లల్లో జీవనోపాధి లేక అన్నదాతలు పొరుగు రాష్ట్రాలకు పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. అక్కడ చిన్నాచితక పనులు చేసుకుంటూ భారంగా బతుకులీడుస్తున్నారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 42 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా, 35.92 లక్షల హెక్టార్లలోపే విత్తనం పడింది. ఖరీఫ్‌లో గత పదేళ్లతో పోల్చితే 2017లోనే అతి తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత నాలుగేళ్ల కాలాన్నే పరిగణనలోకి తీసుకున్నా ఈ ఏడాది ఖరీఫ్‌లోనే అతి తక్కువగా సాగు నమోదయ్యింది. 2015–16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 36.34 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా, 359 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇక 2016–17లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా, 301 కరువు మండలాలను ప్రకటించారు. 2017–18 ఖరీఫ్‌లో 35.92 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు. అయినా ఒక్కటంటే ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం. అదేమంటే రాష్ట్రంలో కరువే లేదని చెబుతోంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేనేలేవంటూ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ నెల పదో తేదీన ప్రశ్నోత్తరాల సందర్భంగా అసెంబ్లీలో రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.  

250 మండలాల్లో తీవ్ర వర్షాభావం  
ఖరీఫ్‌లో సాగు పడిపోయినా, అరకొరగా సాగైన పైర్లు ఎక్కువభాగం ఎండిపోయినా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, కరువు లేదని ప్రకటించడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. పంటల సాగు తగ్గిపోతే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాలను ప్రకటించకుండా పెట్టుబడి రాయితీని పూర్తిగా ఎగవేసేందుకే ప్రభుత్వం రాష్ట్రంలో కరువు లేదంటూ నమ్మబలుకుతోందని ఆరోపిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన సెప్టెంబర్‌ నెలాఖరుకు దాదాపు 250 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడి రాయితీ కోసం రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
 
ఆది నుంచీ ఇదే తీరు  
తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మొదటి నుంచీ అన్యాయం చేస్తూనే ఉంది. 2014లో అధికారంలోకి రాగానే అప్పటివరకు చెల్లించాల్సిన రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇక 2014 ఖరీఫ్‌లో ముందుగా నిర్ణయించిన మొత్తంలో రూ.375 కోట్ల పెట్టుబడి రాయితీకి కోత పెట్టింది. 2014లో రాష్ట్రంలోని 566 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు నివేదిక పంపగా, ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.

రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినా దాన్ని రూ.692.67 కోట్లకు కుదించింది. 2015 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయినా, సాగుచేసిన అరకొర పంటలు ఎండిపోయినా తొలుత కేవలం 196 మండలాలనే కరువు ప్రాంతాలుగా  ప్రకటించింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇక 2016లో 450కు పైగా దుర్భిక్ష మండలాలున్నప్పటికీ 301 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా 150 మండలాల రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. మూడేళ్లలో ఇలా కరువు మండలాల కుదింపు వల్ల రైతులు భారీగా పెట్టుబడి రాయితీని నష్టపోయారు. ప్రభుత్వం సక్రమంగా కరువు మండలాలను ప్రకటిస్తే వారికి ఎంతో మేలు జరిగేది.  
 
దేవుడు వరమిచ్చినా...  
కరువు మండలాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో రూపొందించిన డ్రాట్‌ మాన్యువల్‌–2016ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడమే ఇందుకు కారణం. గతంలో వరుసగా 21 రోజులపాటు చినుకు పడకపోతే డ్రై స్పెల్‌(వర్ష విరామం)గా పరిగణించేవారు. 21 నుంచి 28 రోజుల్లో వర్షం కురిసినప్పటికీ కురవాల్సిన వర్షంలో సగం కంటే తక్కువ కురిస్తే డ్రై స్పెల్‌గా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం 2016 డ్రాట్‌ మాన్యువల్‌(కరువు నిర్ధారణ ప్రామాణికాలు)లో పేర్కొంది. దీనివల్ల వర్షాభావ ప్రాంతాలు కరువు మండలాల జాబితాలో చేరడానికి మార్గం సుగమమైంది.

అలాగే గతంలో ఖరీఫ్‌ సీజన్‌ (జూన్‌–సెప్టెంబరు)లో వర్షాభావ పరిస్థితి ఏర్పడితే అక్టోబరులోనూ కరువు మండలాలను నిర్ధారించి ప్రకటించాలనే నిబంధన ఉండేది. జూన్, జులై నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఆ రెండు నెలల వర్షపాత గణాంకాలు, రిజర్వాయర్లలో నీటిమట్టం, పంటల సాగు విస్తీర్ణం, డ్రై స్పెల్‌ లాంటి అంశాల ప్రాతిపదికన ఆగస్టులోనే కరువు మండలాలను ప్రకటించవచ్చని డ్రాట్‌ మాన్యువల్‌ – 2016లో కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 250పైగా మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో చేరేవి. విపత్తు సాయం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వచ్చేవి. ఇందుకు భిన్నంగా పెట్టుబడి రాయితీ ఎగవేయడమే లక్ష్యంగా ఆగస్టు నుంచి కరువు మండలాలను ప్రకటించకుండా నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అసలు రాష్ట్రంలో కరువే లేదంటూ వాదిస్తోంది.  
 
సస్యశ్యామలమంటే సాగు పడిపోవడమా? 
‘‘సస్యశ్యామలం చేయడమంటే  ప్రభుత్వం దృష్టిలో పంటల సాగు పడిపోవటమా? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. 2008–09 ఖరీఫ్‌లో 13 జిల్లాల్లో 43.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2012లో 42 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో మాత్రం 35.9 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఇవి రాష్ట్ర వ్యవసాయ శాఖ(ఏపీ అగ్రినెట్‌ నివేదిక) గణాంకాలే. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా కరువు లేదని ఎలా చెబుతారు?’’  
– నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు 
 
రైతులకు అన్యాయం చేయొద్దు  
‘‘రాష్ట్ర ప్రభుత్వం తీరు దారుణం. అన్నదాతలకు అన్యాయం చేయాలని చూడటం శోచనీయం. సర్కారుకు తప్పకుండా రైతుల ఉసురు తగులుతుంది. 2016 డ్రాట్‌ మాన్యువల్‌ ప్రకారం కరువు మండలాలను ప్రకటించాలి. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడంతోపాటు పంట రుణాలను రీషెడ్యూల్‌ చేసి వడ్డీని రద్దు చేయాలి. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రికి లేఖ రాస్తాం’’  
– కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement