'చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే..'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులు, వ్యవసాయంపై శ్రద్ధ లేదని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడంపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని అన్నారు.
చంద్రబాబుకు వ్యవసాయాన్ని ఆదుకోవాలన్ని తలంపు లేదని బొత్స ఆరోపించారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనోపాధి అని చెప్పారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిందని బొత్స పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. వరికి 1450 రూపాయల కనీస మద్దతు ధర సరిపోదని అన్నారు. రైతులకు బోనస్ ప్రకటించాలని, క్వింటాల్కు 200 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని రాజధాని పేరుతో లాక్కున్నారని, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని విమర్శించారు.