సాక్షి ప్రతినిధి, విజయనగరం: రైతులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయవద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షాలపై మండిపడ్డారు. చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ పెట్టిన బకాయిలను అణా పైసలతో సహా చెల్లిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు పెట్టిన బకాయిల విషయమై శుక్రవారం ఆయన కలెక్టర్, ఇతర అధికారులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015 సంవత్సరం నుంచి ఈ ఫ్యాక్టరీ చెరకు రైతులకు సుమారు రూ.27.80 కోట్లు బకాయి పడిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించిందని గుర్తు చేశారు.
ఆ ఫ్యాక్టరీ మళ్లీ రూ.16 కోట్ల మేర బకాయిలు పెట్టిందని, వీటిని కూడా చెల్లిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీకి చెందిన దాదాపు రూ.10 కోట్ల విలువైన పంచదారను ప్రభుత్వం సీజ్ చేసిందన్నారు. దాన్ని చట్టప్రకారం విక్రయిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీకి చెందిన 24 ఎకరాల భూమిని వేలం వేయించి, మిగతా బకాయిలు చెల్లిస్తామని వివరించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతుల ముసుగులో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దుశ్చర్యలకు పాల్పడినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. రాళ్లతో దాడి చేసినా పోలీసులు ఎవరిపైనా లాఠీచార్జి చేయలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. పోలీసులే గాయపడ్డారన్నారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులను కోరారు. రాజకీయాల కోసం అన్నం పెట్టే రైతన్నలతో ఆటలాడవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు.
చంద్రబాబు హయాంలోనే గంజాయి సాగు
టీడీపీ వల్ల రాష్ట్రానికి వినాశనమేనని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల పాదయాత్ర పేరుతో చేస్తున్నది టీడీపీ కార్యకర్తల ఆందోళనగా పేర్కొన్నారు. చంద్రబాబు
ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కువైందని అన్నారు. అందుకు సాక్ష్యంగా అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో క్లిప్‌ను మీడియాకు చూపించారు.
పవన్ కల్యాణ్‌కు క్లారిటీ లేదు
పవన్ కల్యాణ్‌కు ఏ అంశంపైనా క్లారిటీ లేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి ముందుగా తన మిత్రులైన బీజేపీ నేతలను స్టీల్‌ప్లాంట్ గురించి ప్రశ్నించాలని సూచించారు. జనసేనకు నిబద్ధత, అంకితభావం లేవని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండును తామెన్నడూ పక్కన పెట్టలేదని, అవకాశం ఉన్న ప్రతిచోటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment