ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స | Botsa Satyanarayana Strong Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స

Published Sun, Sep 1 2019 3:12 PM | Last Updated on Sun, Sep 1 2019 5:04 PM

Botsa Satyanarayana Strong Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి మారిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ ప్రధాన నిందితులని ఆరోపించారు. జనసేన పవన్‌కల్యాణ్‌ మాట తీరు చూస్తుంటే టీడీపీ అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నారని విమర్శించారు. ఆదివారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాముఖంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 

‘రాజధాని పరిధి ప్రాంతంలో భూముల విషయంలో బినామీ, దురాక్రమణకు గురైన భూముల గురించి సమీక్ష జరిపాము. రోడ్ల టెండర్లలో ధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నం చేశారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగును రూ.10 వేలు చేశారు. ఈ కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులు కాబట్టి ఎల్లోమీడియాతో విమర్శలు చేయిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రశ్నించని పవన్‌ ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బాషా తీరు టీడీపీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. అమరావతి సామాన్యులుకా సంపన్నులకా అన్నది పవన్ కళ్యాణ్ కాదా? కులాల రొచ్చు లేని రాజధాని కావాలి అనలేదా? భూదోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాజధాని నిర్మాణం ఆపేస్తా అని అన్నారా లేదా? రాజధాని అంశంలో రైతులకు అన్యాయం చేస్తే మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పలేదా? రాజధాని పేరుతో నూజివీడు వాసులను టీడీపీ మోసం చేసిందని ఆయన గతంలో చెప్పలేదా’ అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం-2 అయిన పవన్ కల్యాణ్ మాటలు ప్రజలు గమనిస్తున్నారని, ద్వంద్వ వైఖరి మార్చు కోవాలని సూచించారు.

‘రెండు మెట్లు దిగి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ లో చేరాను. కాల మహిమతో కాదు, ప్రజలు నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. మిమ్మల్ని(టీడీపీ, జనసే) ప్రజలు తిరస్కరించారు. మీలాంటి నాయకులు ఉన్నంత కాలం జగన్‌మోహన్రెడ్డి సీఎంగానే ఉంటారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయకుడికి, వారి ఆర్ధిక లావాదేవీలకు అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు ఉంటున్న ఇల్లు, మీరు ఉంటున్న ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒక్కరు కాదా? రాజధాని ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో చెందినది కాదు. ప్రభుత్వధనం దుర్వినియోగం కాకుండా చూడటం మా బాధ్యత. వైఎస్ ఆశయాలను నిరవేర్చడం మా పార్టీ లక్ష్యం. పోలవరాన్ని టీడీపీ ఏటిఎంలా వాడుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీనే చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ చిలక పలుకులు పలుకుతున్నారు. పదేళ్లుగా విజయనగరానికి నేనేం చేశానో చూపిస్తా రండి. రాధాకృష్ణ వస్తాడో లేక ఎవరిని పంపిస్తారో పంపండి’ అంటూ సవాల్‌ విసిరారు.

‘వైఎస్‌ రాజశేఖర్రెడ్డి 10వ వర్ధంతి రోజున సీఎం జగన్‌ చేతుల మీదుగా విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తారు. గత ప్రభుత్వం దురుద్దేశంతో విగ్రహాన్ని తొలగించింది. ప్రతి వ్యక్తి తాలూకా సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత.  కొందరు వ్యక్తుల స్వలాభం కోసం పార్టీ పనిచేయదు’అని బొత్స స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement