మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మాట ఎప్పుడో చెప్పారని తెలిపారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్వాస తీర్మానంవల్ల ప్రయోజనం లేదని అంటున్నారని, అయితే ఆ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది టీడీపీ భాగస్వామ్య పార్టీయేనని గుర్తు చేశారు. ప్రతిపక్షానికి చట్టాలు తెలియని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ చట్టాలు తెలియనిది మాకా? మీకా? అని ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానంపై కేంద్రం మీద ఒత్తిడి తెస్తే ఎక్కడ కేసులు బయటపడతాయోనని, విచారణ జరుగుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. అందుకే అవిశ్వాసం, రాజీనామాలు వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమకు ఎవరు మద్దతు ఇచ్చినా అభ్యంతరం లేదని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment