
సాక్షి, అమరావతి: ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దీన్ని ఓర్వలేకే ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును జాకీలు, క్రెయిన్లు పెట్టి లేపాలని టీడీపీ అనుకూల మీడియా విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో మౌలిక వసతులు కూడా కల్పించని, అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తిచేసి తీరుతామన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం బొత్స మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారమే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లను లబ్ధిదారులకు ఒక్క రూపాయకే ఇవ్వబోతున్నారని.. 365, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకు మౌలిక సదుపాయాలూ సమకూర్చారని తెలిసి దుర్బుద్ధితో పచ్చ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందన్నారు. ఆయన ఇంకేమన్నారంటే..
చెప్పింది ఏడు లక్షలు.. కట్టింది 51వేలు
‘తెలుగుదేశం ప్రభుత్వం 7 లక్షల టిడ్కో ఇళ్లు కడతామని కేంద్రం నుంచి ఓ పథకాన్ని తెచ్చింది. 4.54 ఇళ్లకే జీవో ఇచ్చింది. అందులో 3.13 లక్షల ఇళ్లనే ప్రారంభించింది. ఇందులోనూ 51,616 ఇళ్ల నిర్మాణం మాత్రమే చేపట్టింది. 2.62 లక్షల ఇళ్లకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. కానీ, వీటిలోని 1.43 లక్షల ఇళ్లను రూపాయికే పేదలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అలాగే, జగనన్న కాలనీల్లో పేదలకు సెంటు స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తామని, మరో రూ.50 వేల నుంచి రూ.70వేలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పాం. ఈ ఇల్లు కానీ.. రూపాయికే ఇచ్చే టిడ్కో ఇల్లును కానీ ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకే కల్పించాం. స్వతంత్రం గా ఉండే జగనన్న ఇల్లే కావాలని వారంతా కోరుకుం టున్నారు. అందుకే 51,616 ఇళ్లను రద్దుచేయాల్సి వచ్చింది. సుమారు 163 చోట్ల 90వేల యూనిట్లలో నిర్మాణమవుతున్న 2.62 లక్షల ఇళ్లను పూర్తిచేస్తాం. 180 రోజుల్లో 90 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తాం. మరో 90వేల ఇళ్లను 12 నెలల్లో.. మిగిలినవి 18 నెలలలో పూర్తిచేస్తాం’.
ఎవరివి పిచ్చుక గూళ్లు?
‘తాము కట్టేవి పిచ్చుక గూళ్లలా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. ఆయన ఐదేళ్ల పాలనలో సుమారు 6 లక్షల ఇళ్లు కట్టారు. వై ఎస్ జగన్ వచ్చాక రెండేళ్లలోనే 28 లక్షల 30వేల ఇళ్లు కడుతున్నారు. చంద్రబాబు 224 చదరపు అడుగుల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు వెచ్చిస్తే.. జగనన్న కాలనీల్లో సీఎం జగన్ 340 చదరపు అడుగుల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు.. మౌలిక వసతులకు మరో రూ.50వేల నుం చి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఒక్కో ఇంటి నిర్మాణానికి ఖర్చు రూ.2.30 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు అవుతుంది. దీన్నిబట్టి ఎవరివి పిచ్చుక గూళ్లో సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో ప్రజల సొమ్ము దోచుకుతింటే ఈ ఎల్లో మీడియా ఎప్పుడైనా వార్తలు రాసిందా?’ అని బొత్స ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం యజ్ఞ సంకల్పంతో జగనన్న కాలనీలను నిర్మిస్తుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment