
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని.. టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు.. స్పీకర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగి సభను అపహాస్యం చేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో టీడీపీ తీరు అత్యంత జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా ఉందన్నారు. సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో చైర్మన్‌ను చుట్టుముట్టారని ధ్వజమెత్తారు.
సీఎం నిర్ణయం చారిత్రాత్మకం
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూ.483 కోట్ల రాయితీ ఇస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని బొత్స అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఇళ్లను పేదలకు ఉచితంగా అందించాలని ఇప్పటికే నిర్ణయించామని తెలిపారు. 365 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన రూ.50 వేల అప్ ఫ్రంట్ మొత్తంలో రూ. 25 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.లక్షలో రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. లబ్ధిదారులు చెల్లించగా మిగిలిన సగం మొత్తాలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇలా ఇచ్చే రాయితీల మొత్తం రూ.483 కోట్లు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment