చంద్రబాబూ.. హామీ నెరవేర్చు
కొమరోలు : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి చంద్ర బాబు వారికిచ్చిన హామీ నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని రాజుపాలెం పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతుల రుణాలన్నీ మాఫీ చేసి తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలని ముత్తుముల కోరారు. ప్రస్తుతం రూ.50 వేలు మాఫీ చేస్తున్నారని, దాని వడ్డీ కూడా మాఫీ చేస్తున్నారో లేదో చెప్పాలన్నారు. అదే విధంగా రూ.50 వేలు పైన రుణం తీసుకున్న రైతులకు ఐదు విడతలుగా మాఫీ చేస్తామంటున్నారని, అప్పటి వరకూ కొత్త రుణాలు, వడ్డీ పరిస్థితి ఏంటో రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు.
రుణ మాఫీపై అధికారులు, రైతులు, బ్యాంకు అధికారులు గందరగోళంలో ఉన్నారని, వారి సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో పండించిన సుమారు 50 టన్నుల శనగలు గోడౌన్లలో నిల్వలు ఉన్నాయని, వీటిని రైతుల నుంచి క్వింటా రూ.5 వేలకు కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మేలుచేయాలన్నారు. డ్వాక్రా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలపై వడ్డీభారం మోపుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి తక్షణమే సమాధానం చెప్పాలని అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్‌డీఓ చంద్రశేఖరరావు, కొమరోలు, గిద్దలూరు ఎంపీపీలు కామూరి అమూల్య, కడప వంశీధర్‌రెడ్డి, ఎంపీడీఓ దేవడ్ల నర్సయ్య, ఎంపీటీసీ సభ్యురాలు గోడి లక్షమ్మ, ఎంఈఓ బొర్రా వెంకటరత్నం, వ్యవసాయాధికారి జక్కం మెర్సీ పాల్గొన్నారు.