ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’! | YS Jagan Mohan Reddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’!

Published Tue, Feb 7 2017 1:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’! - Sakshi

ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’!

కేరళలో తెలుగు రైతుల భిక్షాటన.. సీఎం సిగ్గుతో తలదించుకోవాలి
ఉరవకొండ ‘మహాధర్నా’లో చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌..


హంద్రీనీవా కోసం దశాబ్దాల పోరాటం
♦ వైఎస్‌ హయాంలోనే 90% పనులు పూర్తి
♦ మూడేళ్లలో మిగిలిన 10% చేయలేదు
♦ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే అనంతలో 1.18లక్షల ఎకరాలకు నీరు
♦ హంద్రీనీవాకు రెండుసార్లు బాబు శంకుస్థాపన
♦ కాంట్రాక్టర్లు, కమీషన్లపైనే ఆయన దృష్టి
♦ పట్టిసీమపై పచ్చి అబద్దాలు.. సీమకే కాదు డెల్టాకూ అన్యాయం

సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘వలసలు, ఆత్మహత్యలు అధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది అనంతపురమే! రాజస్తాన్‌లోని జైసల్మీర్‌ కంటే అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. పదిమందికి అన్నం పెట్టే రైతులు కేరళ వీధుల్లో నిలబడి భిక్షమెత్తుకుంటున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. హంద్రీ–నీవా ఫేజ్‌–1లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తిచేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పొలాలు సస్యశ్యామలం అవుతాయి. చంద్రబాబు మాత్రం రైతుల శ్రేయస్సు విస్మరించి కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్నారు. అబద్దాలతో వంచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అనడం కంటే ముఖ్య ‘కంత్రి’ అనాలి.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో సోమవారం ఉరవకొండలోని క్లాక్‌టవర్‌ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

‘‘నిత్యం కరువు, కాటకాలతో అల్లాడుతున్న ‘అనంత’ ను ఆదుకునేందుకు  ‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’ ఒక్కటే సంజీవని అని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తు న్నాం. ప్రాజెక్టు కోసం ఆరాటపడుతున్నాం. శ్రీశైలం నుంచి 40టీఎంసీలను రాయలసీమకు రప్పించి నాలుగు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 6,850కోట్లతో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. వైఎస్‌ హయాంలో రూ.4వేలకోట్లకుపైగా ఖర్చుచేసి ఫేజ్‌–1 లో 90శాతం పనులు పూర్తి చేశారు. తక్కిన 10శాతం డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు, 10లక్షలమందికి తాగునీరు అందేది. అందులో ఉరవకొండ నియోజకవర్గంలోనే 80వేల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ మూడేళ్లలో ఈ 10శాతం పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. చంద్రబాబు తాను 9ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో కేవలం రూ.24 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.

ఆ కాలంలో ఒక కిలోమీటరు కాలువ కానీ, ఒక లిఫ్ట్‌ లేదా ఒక ఇటుక కానీ పెట్టిన పాపాన పోలేదు. కానీ 1996 ఎన్నికల్లో ఉరవకొండకు వచ్చి 40టీఎంసీల హంద్రీ–నీవాను 5.5 టీఎంసీలకు కుదించి శంకు స్థాపన చేశారు. కనీసం అదీ పూర్తిచేయ లేదు. మళ్లీ సిగ్గులేకుండా 1999లో ఎన్నికలొచ్చినపు డు రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేశారు. ఎన్నికలొచ్చినపుడ ల్లా వచ్చి ప్రాజెక్టుకు టెంకాయ కొడతాడు. ఎన్నికల తర్వాత ప్రజలతో, హంద్రీ–నీవాతో నాకేం పని, అనంతపురం రైతులు ఎటుపోతే నాకేమి అన్నట్లు వదిలేస్తాడు.

అది ఆయన ‘మనసులో మాట’
చంద్రబాబుకు రైతులపై ఏమాత్రం ప్రేమలేదు. నీటిపారుదలపై అంతకంటే ప్రేమలేదు. 9ఏళ్ల సీఎంగా ఉన్న కాలంలో ‘మనసులోమాట’ అని పుస్తకం రాశారు. అందులో చంద్రబాబు రాసిందేమిటో తెలుసా? ప్రభుత్వం నీటిపారుదల మీద కోట్లు ఖర్చుపెడితే, ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే నీటి తీరువా లక్షల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టులు నిర్మించడం వృథా అని తన మనసులో మాటను పుస్తకంలో రాశారు. అంత గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు.  హంద్రీ–నీవా ప్రాజెక్టుపై ధ్యాస ఉంటే ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2వేల కోట్లు కేటాయించాలి. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. కానీ బాబు కేటాయింపులు చూస్తే 2014–15లో రూ.100 కోట్లు మాత్రమే. 2015–16లో రూ.380 కోట్లు మాత్రమే. 2016–17కు రూ.504కోట్లు మాత్రమే కేటాయించారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకూ హంద్రీనీవాలో మోటర్లకు 5నెలల కరెంటు బిల్లు రూ.359కోట్లు. కేటాయించిన మొత్తంలో బిల్లులు చెల్లిస్తే తక్కిన డబ్బులతో ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారు? ప్రాజెక్టులపై బాబుకు  ధ్యాసలేదు. పూర్తి చేయాలనే ఆలోచనలేదు. కాంట్రాక్టర్లతో లాలూచీ పడి,  కమిషన్లు ఎలా తీసుకోవాలా అని కుమ్మక్కవుతాడు. హంద్రీ–నీవా 36వ ప్యాకేజీలో రూ.35కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్‌ పనులకు రీఎస్టిమేట్‌ చేయించి రూ.363కోట్లకు అంచనాలు పెంచి తన అస్మదీయులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ 23ప్యాకేజీలో రూ.11కోట్ల పనులు మిగిలిపోతే వీటిని అంచనాలను రూ.110కోట్లకు పెంచి తనకు కావల్సిన వాళ్లకు, బినామీలకు కట్టబెట్టి కమిషన్లు తీసుకునేందుకు కక్కుర్తి పడుతున్నారు.

ముందు ఎలక్షన్‌.. ఆపై కలెక్షన్ల మేనిఫెస్టో..
ఎన్నికలకు ముందు ప్రజలను ఎంత చక్కగా మోసం చేయగలం అనే అంశాలపై అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తారు. ఎన్నికల తర్వాత ‘కలెక్షన్‌ మేనిఫెస్టో’ ముందుకొస్తుంది. మల్యాలకు వెళ్లి అదేదో ఆయనే ప్రాజెక్టు కట్టినట్లు నిలబడి ఫోజులిస్తారు. ‘అనంత’కు వచ్చిన ప్రతీసారి ‘అదిగో హంద్రీ–నీవా! నా కలలోకి వస్తోంది. తీవ్రంగా కష్టపడుతాను అంటూ ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటా!’ అంటారు. నిజానికి వైఎస్‌ హయాంలో ఫేజ్‌–1, 90శాతం పూర్తయింది. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జీడిపల్లి వద్ద రిజర్వాయర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశాడు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని తిరిగి చంద్రబాబు వచ్చి రిబ్బన్‌ కటింగ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టినోళ్లు గొప్పోళ్లా? ప్రాజెక్టు గేట్లు ఎత్తే లష్కర్లు గొప్పోళ్లా అని అడుగుతున్నా? మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారు.  

నాడు వ్యతిరేకించిన వ్యక్తి ఇరిగేషన్‌ మంత్రి..
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులోని తీవ్ర కరువు పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 55వేల క్యూసెక్కులకు పెంచి 85శాతం పనులు వైఎస్సార్‌ పూర్తిచే శారు. మిగిలిన 15శాతం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ ఏ ప్రాజెక్టు తీసుకున్నా పెండింగే! బాబు కేబినెట్‌లోని ఇరిగేషన్‌ మంత్రి బొంకడంలో బాబు కంటే నాలుగురెట్లు ఎక్కువ పీహెచ్‌డీలు చేశారు.   పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రి. వీరికి సీమ, ప్రకాశం, నెల్లూరుపై ప్రేమ ఉందని మనకు కథలు చెబుతారు.

రైతులు భిక్షమెత్తుతున్నా పట్టించుకున్నారా?
‘అనంత’ నుంచి 4.50లక్షలమంది రైతులు, రైతుకూలీలు కేరళ, తమిళనాడు, కర్నాటకకు వలసపోయారు. కేరళలో రైతులు నడిరోడ్డున నిల్చొని మాకు భిక్షం వేయండని అడుతున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఉపాధిహామీ పథకం పనులు ఇవ్వరు. వైఎస్‌ హయాంలో లేబర్‌ కాంపొనెంట్‌కు (కూలీల కోసం) 98 శాతం నిధులు ఖర్చు చేసేవారు. ప్రతి ఒక్కరికీ పని దక్కేది. వంద నుంచి 150రోజులు పనిదినాలు కల్పించారు. కానీ ఇప్పుడు లేబర్‌ కాంపొనెంట్‌ను 40శాతానికి తగ్గించారు. వలసలు పోతున్నా, కేరళలో అడుక్కుంటున్నారని తెలిసినా బాబు ఏమాత్రం పట్టించుకునే పాపాన పోలేదు. బాబు పుణ్యాన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

సీమలో ఒకమాట...డెల్టాలో మరోమాట..
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో ఉన్నపుడు పట్టిసీమ నిర్మించి 45 టీఎంసీల నీటిని ‘సీమ’కు ఇస్తున్నా అంటారు. కానీ పట్టిసీమ ద్వారా డెల్టాకు ఇచ్చే 45 టీఎంసీల మేర నీటిని శ్రీశైలం నుంచి తీసుకోవచ్చని జీవో మాత్రం ఇవ్వరు. ఇదే వ్యక్తి డెల్టాలో పర్యటిస్తే పట్టిసీమ కట్టాను. 45 టీఎంసీలు తెచ్చి ఇక్కడ పంటలు కాపాడాను అంటాడు. ఇదే వ్యక్తి పులిచెంతల ప్రాజెక్టులో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తెలంగాణ వారికి పరిహారం ఇస్తే 45 టీఎంసీల నీటిని స్టోరేజ్‌ చేసుకోవచ్చనేది తెలీదు. కానీ చేయరు. పట్టిసీమ ద్వారా 45 టీఎంసీల నీరు తెస్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దాని గురించి చెప్పడు.

నమ్మేవాళ్లుండాలి గానీ..
చంద్రబాబును నమ్మేవారు ఉండాలే కానీ, హంద్రీ–నీవా ద్వారా శ్రీకాకుళానికి నీళ్లిస్తానంటారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా ఆఫ్రికాకు, అక్కడి నుండి కాలువలు తవ్వి అమెరికాకు నీళ్లిస్తాననగలడు.  అధికారం కోసం సొంతమామను వెన్నుపోటు పొడవగలడు. ఎన్నికలపుడు అదే ఎన్టీఆర్‌ విగ్రహాలకు దండ వేయగలడు. అంత గొప్పవ్యక్తి మన ముఖ్యమంత్రి. వైఎస్‌ పుణ్యమా అని ప్రాజెక్టులు ఒక కొలిక్కి వస్తే మిగిలిన పనులు పూర్తిచేయడు. పైగా కుళాయిలు తిప్పి తానే కట్టానంటాడు. వైఎస్‌ చనిపోయిన తర్వాత గ్రామగ్రామాన వైఎస్‌ విగ్రహాలు వచ్చాయి. కానీ బాబు మాత్రం భవిష్యత్తులో విగ్రహాలుండవేమో అని ఎవరూ గుర్తుంచుకోరేమో అని వైజాగ్‌ సమ్మిట్‌లో తన విగ్రహానికి తానే పూలమాల వేసుకున్నాడు. మంచి చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇది వైఎస్‌ పాలసీ. మంచిచేసినా చేయకపోయినా ప్రచారం చేస్తే చాలనేది చంద్రబాబు పాలసీ.  ప్రజలు వైఎస్‌ను, చంద్రబాబు ఇద్దరినీ గుర్తుంచుకుంటారు. ఎక్కడైనా నీళ్లు కన్పిస్తే వైఎస్‌ గుర్తుకు వస్తాడు. మోసం, కరువు కన్పిస్తే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది.

రెండేళ్లలో హంద్రీ–నీవా పూర్తిచేస్తాం..
మీటింగ్‌ అయిన తర్వాత సాయంత్రం  ఐదారుగురు మంత్రులు టీవీల ముందుకొస్తారు. మంత్రులు నన్ను తిట్టడానికి కాదు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. హంద్రీ–నీవా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రైతులు, దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పోరాటం ఆపేది లేదు.  ఒక్క ఏడాది పోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. రెండేళ్లు సమయం ఇవ్వండి. హంద్రీ–నీవా పూర్తి చేసి చూపిస్తా!’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  

నయవంచన.. దురాశ.. దుర్మార్గం.. దుష్టత్వం
‘‘రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక్కో విశిష్టత ఉంటుంది. గుణగణాలు ఉంటాయి. చంద్రబాబుకు ఉన్న గుణగణాలు ఏవంటే ఆయన సీఎం అవడంతోనే ఆయనతో పాటు కరువొస్తుంది. కరువొచ్చినా ఇన్సురెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ అంతంతమాత్రమే వస్తాయి. రుణాలు మాఫీ కావు. కొత్త రుణాలు రావు. చంద్రబాబు మాత్రం రెయిన్‌గన్స్‌ అంటాడు. వర్షంతో యుద్ధం అంటాడు. నాలుగురోజుల్లో కరువును జయించా అని చెబుతాడు. బాబులో ఇంకా చాలా గుణగణాలు ఉన్నాయి. కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేస్తాడు. రాష్ట్రంతో యుద్ధం చేస్తాడు. రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడతాడు. కాంట్రాక్టర్లతో స్నేహం చేస్తాడు. రైతులతో యుద్దం చేస్తాడు. కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుంటారు. రైతులకు నీళ్లివ్వరు.

ఎన్టీఆర్‌తో కయ్యమాడుతారు ...బాలకృష్ణతో వియ్యమాడుతాడు. మోదీ బలహీనంగా ఉన్నపుడు ఢీ అంటాడు. మోదీ బలంగా ఉన్నపుడు కాళ్లుపట్టుకుని రాష్ట్రాన్ని తాకట్టుపెడతాడు. కేసీఆర్‌ను అందితే జట్టుపట్టుకుంటారు. దొరికిపోతే కేసీఆర్‌ కాళ్లు పట్టుకుంటారు. కృష్ణా, గోదావరి నుంచి పై నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకెళుతుంటే ప్రశ్నించరు. కోతలు కొండంత కోస్తారు. చేతలు ఆవగింజంత చేయరు. తమ పార్టీ తెలుగుదేశం అంటారు. రోజు విదేశాల్లో కన్పిస్తారు. ఒకరోజు సింగపూర్, దావోస్, చైనా, జపాన్‌ అంటారు. ఎక్కడికి వెళితే ఆ దేశాన్ని తీసుకొస్తా అంటారు.

అవినీతిపై యుద్దం అని చెవుల్లో కాలిఫ్లవర్‌ పెడతారు. గుడిభూములను కూడా వదలకుండా అవినీతి చేస్తారు. ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి అంటారా ముఖ్య కంత్రీ అంటారా మీరే చెప్పాలి. ఈయన గుణగణాలను చెప్పాల్సి వస్తే మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రమాదం... ఇలాంటి దుర్గుణాలన్నీ ఒకే మనిషిలోఉన్నాయంటే అది చంద్రబాబులోనే కన్పిస్తాయి. ఇవన్నీ ఉన్నా నిరంతరం అబద్దాలాడుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement