ధాన్యం రైతుకు మద్దతుగా ధర్మయుద్ధం
శ్రీకాకుళం అర్బన్: రైతులు కళ్లాల్లో ధాన్యం పెట్టుకొని అష్టకష్టాలు పడుతుంటే టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమయ్యారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రైతులకు మద్దతుగా.. ధాన్యం కొనుగోలులో జాప్యానికి నిరసనగా శ్రీకాకుళం జీటీ రోడ్డులో డీసీసీబీ పక్కన ఆదివారం ‘రైతుదీక్ష’ చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చేపట్టిన దీక్షకు జిల్లాలోని రైతులు, ప్రజాసంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమన్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను ప్రస్తుతం కొనుగోలు చేసేవారే కరువయ్యారన్నారు.
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే గత 45 రోజుల్లో కేవలం ఏడు వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారన్నారు. రైతు ల సమస్యలు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంకు పట్టడంలేదన్నారు. రైతుల సమస్య అచ్చెన్నకు అర్థం కాకపోతే పరిపాలనా అనుభవం ఉన్న కలెక్టర్‌కు అర్థం కాదా? అని ప్రశ్నించారు. రైతుల సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియకపోతే చేతకాదని చేతులెత్తేసి తప్పుకుంటే ఆ సీటులో మరొకరెవ్వరైనా వస్తారన్నారు. రైతులకు అన్నివిధాలా తామే మేలుచేస్తామంటూ గత ఎన్నికలలో చంద్రబాబు సహా టీడీపీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారని గుర్తు చేశారు. రైతులు, మత్స్యకారుల ఓట్లతో అధికారం దక్కించుకున్నాక వారిని మరోసారి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ పాలన, విజన్ అంటూ ఏవేవో ఆశలు చూపించే చంద్రబాబుకు రైతుల సమస్యలు ఎలా ఉంటా యో కంప్యూటర్ ముందుగా చెప్పలేదేమో అని వ్యంగ్యాస్త్రం విసిరారు.
రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమూ కొనుగోలు చేయక... ప్రైవేటు వ్యాపారులతోనూ కొనుగోలు చేయించకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రైతులు కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారన్నారు. పండిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో చేతిలో డబ్బులు లేక సంక్రాతి పండగకు కూతురు, అల్లుడును పిలుపు చేసేందుకు భయపడుతున్నారన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే ఫుడ్‌ఫెస్టివల్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలంటూ ప్రభుత్వం ప్రజాధనం దర్వినియోగం చేస్తోందని విమర్శిం చారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఎంపీ, మంత్రిలు నిస్సిగ్గుగా మాట్లాడడం శోచనీయమన్నారు. జిల్లాలో 4 లక్షల కుటుంబాలు వ్యవసాయంపై నేరుగా, మరో 10 లక్షల కుటుంబాలు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయన్నారు.
వారెవరూ పండగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రానున్నాయని, అప్పుడు టీడీపీ నాయకులు ఏం చెబుతారన్నారు. రాజ్యాంగ, చట్టవిరుద్ధ ప్రభుత్వాలు ఎంతకాలం నడుపుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మనేని సీతారాం, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి తదితరులు మాట్లాడారు. రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును దుయ్యట్టారు. సాయంత్రం తమ్మినేని సీతారం నిమ్మరసం ఇచ్చి ధర్మాన ప్రసాదరావుతో దీక్ష విరమింపజేశారు.