సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘కొల్లేరు’ రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కొల్లేరు రైతుల గురించి ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,600 ఎకరాల జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం చూసి అధికార యంత్రాంగం విస్తుబోతోంది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సాధికార కమిటీ అనుమతి లేనిదే కొల్లేరు అభయారణ్యంలో సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 20,600 ఎకరాలను అభయారణ్యం నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, రైతులకు ఇచ్చేస్తామని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని అధికారులు, పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదు?
వాస్తవానికి కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 3 నుంచి 5కు పెంచడం ద్వారా రైతులను దగా చేసింది చంద్రబాబే. మూడో కాంటూరు వరకూ 135 చదరపు కిలోమీటర్ల పరిధిలో 33,750 ఎకరాలకే పరిమితమైన కొల్లేరు అభయారణ్యాన్ని ఐదో కాంటూరుకు పెంచారు. దీనివల్ల కొల్లేరు అభయారణ్యం విస్తీర్ణం 77,138 ఎకరాలకు(308 చదరపు కిలోమీటర్లకు) విస్తరించింది. ఈ మేరకు 1999 అక్టోబరు 4న చంద్రబాబు ప్రభుత్వం జీవో 120ను జారీ చేసింది. దీనివల్ల 20,000 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములు కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి కొత్తగా చేరాయి. ఫలితంగా ఆయా భూముల్లో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం లేక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు.
కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలని, తమ భూములను అభయారణ్యం నుంచి మినహాయించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పలు మండలాల రైతులు ఉద్యమించారు. తర్వాత కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలంటూ చంద్రబాబు సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని ప్రకారం సీఎం నేతృత్వంలోని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు ఇదే తీర్మానం చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపించి చేతులు దులుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు 2015 సెప్టెంబరులో ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. దీన్నిబట్టే కాంటూరు కుదింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం ఆమోదం కోసం మోదీపై చంద్రబాబు ఏమాత్రం ఒత్తిడి తేలేదని తేటతెల్లమవుతోంది. తాజాగా కొల్లేరు రైతులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో చంద్రబాబు కళ్లు తెరుచుకున్నాయి. 3–5 కాంటూరు పరిధిలోని జిరాయితీ, పట్టా భూముల రైతులకు ఏదో మేలు చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నిజంగా తమ మేలు కోరే వారే అయితే ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం పరిధిలోని అంశమని తెలిసినా..
కొల్లేరు కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,000 ఎకరాలకు పైగా జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇస్తామని చంద్రబాబు చెప్పడం వారిని మోసగించడమేనని అధికారులు అంటున్నారు. జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు నేతృత్వంలోని సాధికార కమిటీ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం (జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు) ప్రతిపాదన పంపితేనే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. అయినా ఆయా భూములను తానే రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు చెప్పడం మోసగించే ప్రయత్నమేనని అధికారులు పేర్కొంటున్నారు.
సమస్యను పరిష్కరిస్తామన్న జగన్
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి కొల్లేరు రైతుల గోడు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరు వాసుల నుంచే ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. కొల్లేరు భూములు రీ సర్వే చేస్తామని ప్రకటించారు.
నిర్ణయాధికారం సుప్రీంకోర్టుదే..
‘‘కొల్లేరు సరస్సు కాంటూర్ కుదింపు లేదా భూముల మినహాయింపు అధికారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సెంట్రల్ సాధికార కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు కొల్లేరులో భూములను చేపల చెరువులుగా మార్చేసి, వ్యాపారం చేస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొల్లేరు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’
– తల్లవజ్జుల పతంజలిశాస్త్రి, పర్యావరణవేత్త, రాజమండ్రి(ఫోటో నెంబర్ 1001)
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
‘‘కొల్లేరు భూముల విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కొల్లేరు భూములు పంపిణీ చేయాలంటూ నాలుగేళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తిప్పి పంపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండంతో మళ్లీ భ్రమల్లో ముంచుతున్నారు’’
– ఘంటసాల లక్ష్మీ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు (1002)
జగన్ హామీ ఇవ్వడం వల్లే..
‘‘కొల్లేరు కాంటూరును కుదిస్తామంటూ నాలుగేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆశ పెట్టింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారం దక్కించుకున్న తర్వాత మోసం చేసింది. నాలుగేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మా సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు భూములపై మాట్లాడుతున్నారు’’
– ఘంటసాల బలరామయ్య, గుడివాకలంక (1004)
Comments
Please login to add a commentAdd a comment