పోరుబాట పట్టండిపార్టీని బలోపేతం చేయండి
సాక్షి, విజయవాడ : రైతులకు రూ. 87 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యేంతవరకు వైఎస్సార్ సీపీ వారి పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఐదో తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసి గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమన్వయకర్తలకు పిలుపునిచ్చారు.
శనివారం ఐలాపురం హోటల్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు వై.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అధ్యక్షత వహించారు.
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు చంద్రబాబు అడ్డదారులు వెతుకుతున్నారని మండిపడ్డారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు బాండ్లు జారీ చేస్తామని చెబుతున్నారని, అయితే దానికి అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. అందువల్ల అది రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడదన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రజలకు హామీలిచ్చారని, వారు నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే ఇప్పుడు తప్పించుకునే దారులు వెతుకుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. సాగి ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉత్తరాంధ్ర రైతులు వేల కోట్ల పంట బీమా నష్టపోయారని చెప్పారు. వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా హుదూద్ బాధితులకు తమ పార్టీ సహాయం చేస్తుందని చెప్పారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం చేపట్టాక మనిషిగా మారారని అందరూ అనుకున్నారని... కానీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శించారు.
మరో ముఖ్య నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలలకే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని చెప్పారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ.. నవంబర్ 15 కల్లా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి అధినేతకు పంపుతామని చెప్పారు. పార్టీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని మాట్లాడుతూ.. వంచన చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
బాబు మాయమాటల్ని ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. సమీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, మేకా వెంకట ప్రతాప అప్పారావు, జలీల్‌ఖాన్, రక్షణనిధి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, పార్టీ నేతలు దూలం నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, తాతినేని పద్మావతి, సింహాద్రి రమేష్‌బాబు, కార్పొరేటర్లు, నగర నేతలు, మండల నాయకులు పాల్గొన్నారు.