వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం: లక్ష్యం.. క్లీన్‌ స్వీప్‌ | CM YS Jagan Targets 175 out of 175 seats General election | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం: లక్ష్యం.. క్లీన్‌ స్వీప్‌

Published Mon, Oct 9 2023 3:25 AM | Last Updated on Mon, Oct 9 2023 5:58 PM

CM YS Jagan Targets 175 out of 175 seats General election - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమ­వారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమా­వేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మె­ల్సీ­లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌­చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

గత 53 నెలలుగా సుపరి­పా­లన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇం­టికీ, గ్రామానికీ, నియోజక­వర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభా­వవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. 

దేశ చరిత్రలోనే కొత్త రికార్డు
సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు అమలు చేశా>రు. గత 53 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4.69 లక్షల కోట్ల ప్రయోజనం పేదలకు చేకూర్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు.

వార్డు, గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పోర్టులు, షిప్పింగ్‌ యార్డులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేశారు. దాంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. తద్వారా సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించడం అందుకు నిదర్శనం. 

నిత్యం ప్రజలతో మమేకం 
అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజలతో సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులు మేమకమవుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రతి ఇంటికీ వివరించడానికి 2022 మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 7 నుంచి 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మెగా పీపుల్స్‌ సర్వే’లో 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు అంటే 80 శాతం మంది ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ నినదించారు. ఇటీవల ప్రముఖ జాతీయ ఛానల్‌ టైమ్స్‌ నౌ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని తేలడమే అందుకు నిదర్శనం. ప్రజల్లో అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సమన్వయంతో పనిచేస్తే 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ ప్రతినిధులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 

ఎన్నికలకు సమాయత్తం : సజ్జల రామకృష్ణారెడ్డి  
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో సోమవారం పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పికొట్టి.. ప్రజల ఆశీర్వాదం కోరే దిశగా శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారని వివరించారు.

విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆదివారం ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు చల్లా మధుసూధనరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు.

సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయలని సూచించారు. భద్రత ఏర్పాట్ల గురించి విజయవాడ పోలీస్‌ కమీషనర్‌ కాంతిరాణా టాటా వివరించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగడం ఐదుకోట్ల మంది ప్రజలకు చారిత్రక అవసరం అన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లినట్లుగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ఆహ్వానితులు సకాలంలో సభ ప్రాంగణానికి చేరుకోవాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఆదివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

సోమవారం ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, రొయ్యల కూర, పీతల వేపుడు, రసం, కుండ పెరుగు.. తదితర 30 రకాల వంటకాలతో పసందైన భోజనం అందిస్తామన్నారు. ఆహ్వానితులు ఉదయం 8.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, పోలీసులు స్టేడియం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement