సాక్షి, విజయవాడ: పంట నష్టం జరిగినందుకు పరిహారం కోరుతున్న రైతులపై వేధింపులు ఎక్కువయ్యాయి. బుధవారం పోలీసు స్టేషన్‌లోనే పురుగు మందు తాగిన ముగ్గురు రైతుల్లో పూర్ణయ్య అనే రైతుపై పోలీసులు 13 కేసులు పెట్టారు. అంతే కాకుండా ఇతనిపై గంపలగూడెం పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. పెనుగొలను గ్రామంలో 41మంది రైతుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ధర్నాలకు దూరంగా ఉంటామని హామీ పత్రాలు రాయించుకున్నారు. పరిహారం కోసం పోరాడుతున్న 56 మంది రైతులపై కూడా పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టడంతో తిరువూరు కోర్టు చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పంట నష్టపోయిన రైతులపైనే కేసులు పెట్టి వేధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముంచిన నకిలీ విత్తనాలు
కాగా కృష్ణా జిల్లాలో నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచాయి. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మూడు మండలాల్లో 122 మంది రైతలకు భారీగా నష్టవాటిల్లింది. నష్టపోయిన పంటకు పరిహారం కోసం ఏడాది నుంచి ప్రభుత్వానికి రైతులు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో బుధవారం రైతులంతా కలిసి ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి.. తమ సమస్యలను చెప్పుకునేందుకు విజయవాడ తరలి వచ్చారు.
అయితే రైతుల ఛలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాకుండా రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు( పూర్ణయ్య, రామయ్య, తిరుపతిరావు) స్టేషన్‌లోనే పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైతులను కోలుకుంటున్నారని. ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం డిశ్చార్జీ చేస్తామని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతులను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున రైతులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment