మతిలేని అను‘మతి’ | Produced in our farms involved | Sakshi
Sakshi News home page

మతిలేని అను‘మతి’

Published Fri, Jan 31 2014 1:51 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

మతిలేని అను‘మతి’ - Sakshi

మతిలేని అను‘మతి’

  • మా పొలాలు మునిగినా పట్టించుకోరా
  •   ప్రధాన ప్రతిపక్షం ఎటు పోతోంది
  •   ‘యాక్టివ్’కు అనుమతిపై రైతాగ్రహం
  •  శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన చందంగా పత్రికలో సుద్దులు పలుకుతున్నట్టు రాతలు రాసే పత్రికాధిపతే పైరవీలకు పాల్పడి రైతుల నోట్లో మట్టికొట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు కుమ్మక్కు వ్యూహాలను రచిస్తూ పచ్చని పైరుపై విషం చిమ్మడానికి ఎత్తులు వేస్తున్నారు. గలగల పారే జలంలో కల్లోలం రేపి వందలాదిమందిని నిండా ముంచే ప్రయత్నానికి చకచకా ప్రయత్నాలు జరిగిపోతున్నాయి.  ఈ దుర్మార్గానికి అధికార పక్షం మార్గదర్శకత్వం వహిస్తుంటే ... అడ్డుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.
     
    సాక్షి, విజయవాడ/న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సమీపంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యాక్టివ్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన జలవిద్యుత్ కేంద్రానికి తిరిగి అనుమతి ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బుడమేరు పొంగిన సమయంలో తమ పొలాలు పూర్తిగా నీట మునిగిపోతాయని రైతులు  భయపడుతున్నారు.

    ఇంత నష్టం జరుగుతుందని తెలిసినా కేవలం రాజకీయ లబ్ధి కోసమే కిరణ్ ఈ అనుమతులు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. రెగ్యులేటర్‌పై అడ్డంగా పవర్‌ప్లాంట్ నిర్మాణం వల్ల డిశ్చార్జ్ నాలుగువేల క్యూసెక్కులకు పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.  1960లో డిజైన్ చేసిన 7,500 క్యూసెక్కుల ప్రవాహం కూడా లేకుండా పోయింది. దీంతో వరద పెరిగినపుడు నీరు దిగువకుపోయే మార్గం లేకపోవడంతో పలు గ్రామాలతోపాటు  విజయవాడ నగరం కూడా ముంపునకు గురవుతోంది. ఈ క్రమంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   ఆధ్వర్యంలో పవర్‌ప్లాంట్ ఎదుట భారీ ఆందోళన జరిగింది.
     
    ఇంత నీరు మళ్లింపు ఎలా?
     
    ప్రస్తుతం బుడమేరు డైవర్షన్ చానల్‌లోనే పోలవరం కుడికాల్వను కలపనున్నారు. దీని నుంచి 11,500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. రోజూ 1500 క్యూసెక్కులు ఎన్టీటీపీఎస్ నుంచి వస్తుంది. ఇదికాకుండా బుడమేరు గరిష్ట వరద ప్రవాహం 25 వేల క్యూసెక్కులుగా అధికారులు అంచనా వేశారు. దీన్ని 37,555 క్యూసెక్కుల వరద సామర్ధ్యానికి పెంచాలని నిర్ణయించారు. దీనికోసం బుడమేరు డైవర్షన్ చానల్‌పై ఉన్న ఆటంకాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2009 ఆగస్టు 29న దీనికి ఉన్న అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 670 జారీ చేసింది.
     
    ఇది కక్ష సాధింపా..
     
    దెబ్బతీయడమే లక్ష్యంగా యాక్టివ్ పవర్‌ప్లాంట్‌పై వైఎస్ కక్షసాధింపునకు దిగారంటూ ఆ సంస్థ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ప్రజల ఆందోళనతోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 2008లో బుడమేరు వరదనీటి మళ్లింపుకోసం నీటిపారుదల అధికారులు మూడు ప్రతిపాదనలు తయారుచేశారు. అవి..    
     
    బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్‌పై భాగంలో  20 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించే విధంగా కొత్త డైవర్షన్ చానల్ ఏర్పాటు. దీనికి రూ. 1050 కోట్లు ఖర్చవుతుంది.  1330 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించడంతో పాటు, ఐదు కిలోమీటర్ల మేర కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో సొరంగం తవ్వాలి.  ఇది పోలవరం నీటికి  ఏమాత్రం ఉపయోగపడదు.
     
    వెలగలేరు రెగ్యులేటర్ నుంచి దిగువ భాగంలో గుంటుపల్లి మీదుగా కృష్ణానదిలో కలిసేందుకు 10,400 క్యూసెక్కుల సామర్ధ్యంతో కొత్త చానల్ తవ్వాలి. అయితే ఇది కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ఉపయోగపడదు. పోలవరం కాల్వకు కూడా ఉపయోగపడదు. దీనికి 70 ఎకరాల భూసేకరణతోపాటు రూ. 188 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
     
    ప్రస్తుతం ఉన్న బుడమేరు డైవర్షన్ చానల్‌ను వెడల్పు, లోతుచేయడంతో పాటు  లైనింగ్ చేయడం ద్వారా 37,300 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా ఆధునికీకరించడం. పోలవరం నీటిని కూడా మళ్లించవచ్చు. దీనికయ్యే ఖర్చు రూ. 151 కోట్లు. భూసేకరణ అవసరం లేదు. ఈ మూడు ప్రతిపాదనలు వచ్చినపుడు పై రెండు ప్రతిపాదనలను రైతు లు  వ్యతిరేకించారు.

    2008 మే 23న ఈ ప్రతిపాదనలను పరిశీలించడానికి వచ్చిన  అప్పటి కలెక్టర్ శైలజారామయ్యర్‌ను కూడా నిలదీశారు. అదే ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి సమక్షంలో దీనిపై ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడో ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదించారు. అందులో యాక్టివ్ పవర్‌ప్లాంట్‌కి అనుమతి రద్దుచేసే విషయాన్ని పరిశీలించాలని, వారికి అనుమతి ఇచ్చిన సమయంలో విధించిన నియమ నిబంధనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే నష్టపరిహారం కూడా ఇవ్వాలని సూచించారు.
     
     12 వేల ఎకరాలకు ముంపు భయం


     జి.కొండూరు మండలంలోని వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు డైవర్షన్ చానల్ వస్తుంది.  దీంతో పాటు ఎన్టీటీపీఎస్ ఒకటి, రెండు యూనిట్ల నుంచి వస్తున్న వృథా నీరు కూడా ఇందులో కలవడం వల్ల నీరు ఎగతన్నుతోంది. బుడమేరు ఉధృతరూపం దాల్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎన్టీటీపీఎస్‌లోని ఒకటి, రెండు యూనిట్‌లకు ఉత్పాదనకు కూడా అవరోధం కలుగుతోంది.  దీనితోపాటు రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఇబ్రహీంపట్నం బుడమేరు కట్టకు ఆనుకుని ఉన్న ఖాజీమాన్యంలో అపార్ట్‌మెంట్‌లు, వందలాది ఇళ్లు కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అనేక మార్లు పోరాటాలు నిర్వహించగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించారు. ఎన్టీటీపీఎస్, ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తన స్వార్ధం కోసం అనుమతి ఇవ్వడంతో మరో మారు ఉద్యమం చేపట్టాల్సి వచ్చింది.
     
     అప్పుడే  అడ్డుతగిలాం
     ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయని అప్పుడే అభ్యంతరం చెప్పాం. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నత స్థాయి విచారణ నిర్వహించి ప్రజాప్రయోజనాల దష్ట్యా నిలుపుదల చేయించారు. ప్రాజక్టు కారణంగా ఎన్టీటీపీఎస్ ఉత్పాదనకు కూడా ఆటంకాలు ఉన్నాయి.
     - చెరుకు మాధవరావు, మాజీ ఎంపీపీ, ఇబ్రహీంపట్నం.
     
     పంటపొలాలు నీటమునుగుతాయి
     జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుతో ముఖ్యంగా రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాల్లోని 12 వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. దీనితో పాటు ఇబ్రహీంపట్నంలో బుడమేటి కట్టకు ఆనుకుని ఉన్న ఖాజీమాన్యంలో సుమారు 500 ఇళ్ల వరకు నీట మునిగే ప్రమాదం ఉంది. ఈ ప్రాంత రైతుల అభిప్రాయంతో పనిలేకుండా అనుమతి ఇవ్వడం దారుణం. ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి.
     -ఆర్.రఘునాథరెడ్డి,  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
     
     ఇబ్బందులు బోలెడు..
     జలవిద్యుత్ కేంద్రం కారణంగా గతంలో సుందరయ్యనగర్ కట్టకు ఆనుకుని ఉన్న మా ఇళ్లు అనేక మార్లు నీటమునిగి పడిపోయాయి. ధర్నాలు చేయడంతో  రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిలుపుదల చేయించారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్ ప్రభుత్వం తిరిగి అనుమతించడం మంచి పద్దతి కాదు.
     - కె.ధనలక్ష్మి, ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్ కట్ట
     
     ఎన్టీటీపీఎస్ ఉత్పాదనకు అవరోధం
     బుడమేటి వంతెనపై ఉన్న ఈ ప్రాజెక్టు   వల్ల ఎన్టీటీపీఎస్‌కు కొంత ఇబ్బందే. ఎన్టీటీపీఎస్‌లోకి నీరు రివర్స్‌గా వెళ్లడంతో ఒకటి, రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదనను తగ్గించి చేయాల్సి వస్తోంది. ఇది జెన్‌కోకు నష్టం కూడా.  
     -చెరుకు వేణుగోపాల్,  రైతు సమాఖ్య జిల్లా నాయకుడు, గుంటుపల్లి.
     
     కాలువలు ఆధునికీకరించాలి
     వర్షాకాలం బుడమేరు ఉధృతరూపం దా ల్చినప్పుడల్లా ఈలప్రోలు   లో పంటపొలాలు మునిగి రైతులు  నష్టపోతున్నారు.    రాయనపాడు, షాబాద లలో కూడా కాలువ ప్రదేశాన్ని ఆక్రమించడం వల్ల 18 అడుగులు మాత్రమే ఉంది.  ముందుగా ప్రభుత్వం  కాలువను ఆధునీకరించడానికి చర్యలు చేపట్టాలి.
    -బత్తుల శంకర్రావు, రైతు, ఈలప్రోలు
     
     కేంద్రాన్ని నిలుపుదల చేయాలి
     జలవిద్యుత్ కేంద్రంతో అనేక రకాలు ఇబ్బందులున్నాయి. వర్షాలు పడినపుడు నీరు ఎగదన్ని ఈలప్రోలు గ్రామంలోని సుమారు 800 ఎకరాల వరకు నీట మునుగుతున్నాయి. ఆ కేంద్రం తెరవకుండా చూడాలి. మూసివేసిన ప్రాజెక్టును తెరిపించాలని చూడడం దారుణం
     - కలపాల మచ్చయ్య, రైతు, ఈలప్రోలు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement