ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(పాత చిత్రం)
విజయవాడ: బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవాలని ఇక్కడికి వచ్చానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపడుతుందని, దానికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుందని అన్నారు.
రైతులంతా ప్రకృతి వ్యవసాయం పట్ల మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తోన్న రైతులతో మాట్లాడాలి..వ్యవసాయ క్షేత్రాలను చూడాలని వచ్చానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నా అక్కడికి వెళ్తానని తెలిపారు. తాతల అనుభవాలు నాకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేశాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి పూర్తిగా కనుమరుగువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ పాలేకర్ అనుభవాలు, వ్యవసాయ విధానాలతో వ్యవసాయం చేయాలని సూచించారు.
దేశంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. భారతీయ జీవన విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదుకోవాలని, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చెయ్యాలన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫుడ్స్‌కి ఆదరణ పెరుగుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment