muppavarapu venkaiah naidu
-
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో జరుగుతున్న నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. సీఎం వైఎస్ జగన్ రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది. విజయనగరం డీసీసీబీ చైర్మన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్ విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాస్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. చదవండి: (సీఎం జగన్ దంపతుల చేతుల మీదుగా 'డబుల్ ధమాకా') -
ఉపరాష్ట్రపతిని కలిసిన సోమువీర్రాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజును ప్రకటించిన తర్వాత మొదటసారి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, రాంమాధవ్‌లను కలిసి కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి సోమువీర్రాజు వివరించారు. (సుజనాకు ఝలక్ ఇచ్చిన ఏపీ బీజేపీ) -
ఫిరాయింపులు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్:పార్టీ ఫిరాయింపుదారులను రీకాల్ చేసే డిమాండ్ బలంగా వినిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఫిరాయింపుల పరిస్థితిని చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులను మూడు నెలల్లో పరిష్కరించే దిశగా ప్రిసైడింగ్ అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు. రాజకీయ నాయకులపై ఎన్నికల పిటిషన్లు, క్రిమినల్ కేసులు నిర్ణీత పద్ధతిలో ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరగా నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితి మారాలన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ 46వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చట్టసభల్లో తరచూ అంతరాయాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ తరహా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, రాజ్యాంగ నిర్మాతల దృష్టికి ఈ తరహా విధానాలు ప్రతికూలంగా కనిపిస్తాయని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిలబెట్టడంలో విఫలం అయినట్లుగానే భావించాలన్నారు. చట్ట సభల్లో తరచూ అంతరాయాలు ప్రజాస్వామ్య మూల స్థంభం పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయన్నారు. ప్రజా జీవితాల్లో ఉండేవారు కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ‘‘చర్చించండి...నిర్ణయం తీసుకోండి...కానీ ఆటంకాలు సృష్టించకండి’’అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టసభల సమర్థవంతమైన పని తీరు కోసం ఇదే సరైన మార్గమని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు స్థిరమైన ప్రభుత్వం దిశగా తమ ఎంపికను స్పష్టంగా తెలియజేశారన్నారు. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం లాంటి సమస్యలను అధిగమించే దిశగా ప్రభుత్వాలు ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, మెరుగైన మౌలిక వసతుల ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రజల ఆనందంగా మలచాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో సమర్థవంతమైన నిర్వహణ పద్ధతులు ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగాలని, ఆర్థిక వృద్ధిని సమాజవృద్ధిగా మలిచేందుకు హెచ్ఎంఏ వంటి సంస్థల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. దేశంలో జీఎస్టీ ఓ విప్లవాత్మక పన్నుల వ్యవస్థకు కొలమానమన్నారు. 17 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ చర్చలను కొలిక్కి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూపిన చొరవ, చాకచక్యాన్ని ఆయన ప్రశంసించారు. జీఎస్టీ కౌన్సిల్ 34 సమావేశాల్లో అన్ని నిర్ణయాలు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, ఇది గొప్ప నిర్వహణ ద్వారానే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు వేగవంతం ప్రధానమంత్రి ప్రారంభించిన సంస్కరణలను వేగవంతం చేయడానికి సమయం ఆసన్నమైందని, రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ప్రపంచ బ్యాంకు తాజా సూచనలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్నాయన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాలు కలసికట్టుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవాలని సూచించారు. పారదర్శకత, సమగ్రత, నైతికత, నిజాయితీ సూత్రాలు చాలా ముఖ్యమని, వ్యాపార కార్యకలాపాల్లో అవి ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. అభివృద్ధి క్రమంలో అవినీతి, కుంభకోణాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఆయన, ఆర్థిక నేరస్థులు విదేశాలకు పారిపోయే అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. జయేశ్ రంజన్‌కు పురస్కారం ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీల కింద పురస్కార గ్రహీతలకు ఉపరాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. మేనేజర్ ఆఫ్ ద ఇయర్ – 2018ను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ పీసపాటి తదితరులు హాజరయ్యారు. -
యోగాకు మతం లేదు: వెంకయ్య
ఢిల్లీ: యాంత్రిక జీవితం నుంచి మళ్లీ మనమంతా వెనక్కి వెళ్లాలని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి విజయ్ గోయల్, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, ఢిల్లీలోని తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... యోగాకు మతం లేదని, దానిని అందరూ అనుసరించాలని సూచన చేశారు. సూర్య నమస్కారం ఇష్టం లేకుంటే చంద్ర నమస్కారం చేయవచ్చునని తెలిపారు. భారత దేశం ఎన్నడూ కూడా ఏ దేశంపైన దాడులు చేయలేదన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునేది భారతదేశమని, ప్రపంచమంతా ఒక కుటుంబం లాగా బతకాలన్నదే భారతీయ సంస్కృతి అని తెలియజేశారు. సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లడమే భారతీయ సంస్కృతని అభివర్ణించారు. విశిష్టమైన ఈ సంస్కృతిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. 42 ఏళ్ల తర్వాత ఎన్నికల ఉపన్యాసాలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారని చెప్పారు. రాజ్యాంగ విధులు నిర్వహించడం ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. -
మూలాలకు తిరిగి వెళ్దాం
సాక్షి, హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను పునఃపరిశీలించుకొని తిరిగి మన మూలాలకు వెళ్లాల్సిన సరైన తరుణమిదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తద్వారా మన మూలాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగ, అంతర్జాతీయ మిఠాయిల పండుగ –2019 సంబరాలను ఆదివారం ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మన పండుగలు, పర్వదినాల ద్వారా ప్రజల్లో సమైక్యతా భావన పెరుగుతుంది. పండుగల్లోని ముఖ్యోద్దేశాలు అర్థం చేసుకోవాలి. తెలుగువారి వ్యవసాయ పండుగ సంక్రాంతి. మకర సంక్రమణం లో వచ్చే ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి, పాడిపంటలతో రైతులు తులతూగే పండుగే సంక్రాంతి’అని వెంకయ్య పేర్కొన్నారు. ఇదీ గాలిపటాల్లోని భావం! గాలిపటాలను ఎగరేయడం వెనక భావాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని వెంకయ్య నాయుడు తెలిపారు. నేలపై నిలబడి మన ఊహలను గాలిపటాలుగా ఆకాశంలో ఎగురవేస్తున్నామని.. ఆకాశంలోని లక్ష్యాలను అందుకునేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. పతంగులు, ముగ్గులు, గొబ్బెమ్మలతో పోటీలు వంటివి ప్రజల్లో పోటీతత్వం పెంపొందిస్తాయన్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన తీపి పదార్థాలు ఒకే వేదికపై ప్రదర్శించడం భారతీయ తత్వంలో ఉన్న వసుధైక కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మన ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకుందామని వెంకయ్య పిలుపునిచ్చారు. విదేశీ ఆహార, విహార పద్ధతులకు స్వస్తి చెప్పాలన్నారు. ఇందుకోసం ఈ సంక్రాంతి సం దర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. తద్వారా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’నినాదాన్ని నిజం చేద్దామన్నారు. ఒకే చోట వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన 1,200 రకాల మిఠాయిలను ప్రదర్శించడం అరుదైన విషయమని ప్రశంసించారు. పరేడ్ గ్రౌండ్ జనసంద్రం అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండగలో పాల్గొనేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే ఓ ప్రవాహంలా పొటెత్తారు. ఇందులో భాగంగా నిర్వహించిన çఫుడ్‌కోర్టులు, హ్యాండీక్రాఫ్ట్ మేళాలు జనంతో నిండిపోయాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 22 దేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లను పదుల సంఖ్యలో స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కైట్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోజులు గుర్తొచ్చాయ్! ‘తెలుగు వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిం దంటే స్నేహితులతో కలిసి డాబాలపై పతంగులను ఎగురవేస్తూ సందడి చేసేవారం. ఈ పండగ సందడిని చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయ్’అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లను దేశ, విదేశాల్లో ఇనుమడింపజేసేందుకు పర్యాటక శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సంక్రాంతి వచ్చిందంటే కూతుళ్లు–అల్లుళ్లు, కొడుకులు – కోడళ్లు ఒకే చోట చేరడం.. వివిధ వంటకాలు.. ఇవన్నీ మరిచిపోలేని అనుభూతిని కల్పిస్తాయన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ‘2020 నాటికి తెలంగాణ పతంగుల పండగను దేశంలోనే అతిపెద్ద పండగ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. ఇది 4వ అంతర్జాతీయ పతంగుల పండగ, రెండో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అని తెలిపారు. ప్రజ లందరూ ఆసక్తిగా వచ్చి తిలకించి, ఈ వేడుకను ఆస్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ శ్రీనివాసరావు, వరల్డ్ కల్చర్ టూరిజం అసోషియేషన్ అధ్యక్షుడు యూంగ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభు త్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టూరిజం ఇన్చార్జి కమిషనర్ దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్వీట్ఫెస్టివల్లో మిఠాయి తింటున్న స్వామిగౌడ్. చిత్రంలో బుర్రా, మామిడి హరికృష్ణ తదితరులు -
తెలుగులోనే మాట్లాడతానని చెప్పాడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్డాడని, తాను జోక్యం చోసుకుని తెలుగును ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పిన విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధీవదేహానికి వెంకయ్య నాయుడు నివాళులుల అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బ్రతికాడని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణ అని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నాఉ. తన కుటుంబానికి , హరికృష్ణ మరణం తీరని లోటని అన్నారు. -
ప్రకృతికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుంది
విజయవాడ: బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలవాలని ఇక్కడికి వచ్చానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని కాపడుతుందని, దానికి ఆగ్రహం వస్తే కేరళ పరిస్థితి వస్తుందని అన్నారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం పట్ల మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తోన్న రైతులతో మాట్లాడాలి..వ్యవసాయ క్షేత్రాలను చూడాలని వచ్చానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నా అక్కడికి వెళ్తానని తెలిపారు. తాతల అనుభవాలు నాకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేశాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి పూర్తిగా కనుమరుగువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ పాలేకర్ అనుభవాలు, వ్యవసాయ విధానాలతో వ్యవసాయం చేయాలని సూచించారు. దేశంలో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోదీకి చెప్పానని తెలిపారు. భారతీయ జీవన విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆదుకోవాలని, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి పరిశోధనలు చెయ్యాలన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫుడ్స్‌కి ఆదరణ పెరుగుతోందని అన్నారు. -
విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ వైపు..
వెంకయ్యనాయుడు విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి అకర్షితులయ్యూరు. 1970 దశకంలోనే లా విద్యాభ్యాసం పూర్తి చేసినా న్యాయవాది వృత్తి జోలికి పోకుండా ఉద్యమాల వైపు అడుగులు వేశారు. విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొంటూ 1973-74లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తొలిసారి ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి ఓటమి పాలయ్యూరు. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఈయన కేంద్ర మంత్రి పదవి చేపట్టడం ఇది రెండోసారి. * ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చవటపాళెం గ్రామంలో 1949 జూలై 1న రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించారు. *నెల్లూరులో బీఏ, విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో బీఎల్ విద్యనభ్యసించారు. * 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని మళ్లీ ఉదయగిరి నుంచి విజయం సాధించారు. * 1989లో బాపట్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 1996లో బీజేపీ బలంగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో సలావుద్దీన్ ఓవైసీపై పోటీ చేసినా ఓటమినే ఎదుర్కోవాల్సి వచ్చింది. * 1998లో కర్ణాటక నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2004లో మరోసారి, 2010లో మూడోసారీ అక్కడినుంచే ఆయన రాజ్యసభకు ఎంపికయ్యూరు. * 2000- 2002 మధ్య కాలంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో పదవికి రాజీనామా చేశారు. 2004 వరకు ఈ పదవిలో కొనసాగారు. * ఈయన సతీమణి ఊషమ్మ. పిల్లలు హర్షవర్ధన్, దీప -
బీజేపీ మద్దతుతోనే తెలంగాణ
వెంకయ్యనాయుడు సూర్యాపేట, న్యూస్‌లైన్ బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ సూర్యాపేటలో ఆ పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల అభిష్టం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణ ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలకు ఓటువేస్తే కేంద్రంలో ఏమీ చేయలేరన్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందని, 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని అయినా రాష్ట్రం సాధించలేక పోయిందన్నారు. బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేకపోయేదన్నారు. సోనియాగాంధీ వరం వల్లే అంటూ తెలంగాణలో.. బీజేపీ వల్లే రాష్ట్రం విడిపోయిందని సీమాంధ్రలో చెబుతూ కాంగ్రెస్ నాటకాలాడుతుందని ఆరోపించారు. బీజేపీ హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి చెందిందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, రామోజి షణ్ముఖ, పోతెపాక సాంబయ్య, రామినేని ప్రభాకర్, రంగరాజు రుక్మారావు, చలమల్ల నర్సింహ, గోదల రంగారెడ్డి, నల్లగుంట్ల అయోధ్య, జీడి భిక్షం, సారగండ్ల మాణిక్యమ్మ పాల్గొన్నారు. -
మోడీ జనాదరణను చూసి కాంగ్రెస్‌కు భయం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకుగాను కాంగ్రెస్ పార్టీ.. సీబీఐని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని, అదే జరిగితే దేశంలోనే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బీజేపీ ‘నవభారత యువభేరి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజలందరూ ఇప్పుడు గుజరాత్ మోడల్ పాలనను, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు భయపడి కాంగ్రెస్ ఆయనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా పేరున్న సీబీఐని ఆ పార్టీ మోడీ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలు ఈ రోజు మార్పును కోరుకుంటున్నారని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను ఒక్కటి చేసే పార్టీ బీజేపీయేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, రాయలసీమ కాంగ్రెస్, కోస్తా కాంగ్రెస్‌లుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనూ కాంగ్రెస్ అనేక రకాల పేర్లతో ఎన్నో సార్లు చీలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా రకరకాలు చీలిపోయారని, జనతాదళ్ పార్టీ సైతం చీలికలు పీలికలు అయిందన్నారు. దేశ ప్రజలకు సమగ్ర విశ్వాసం కలిగించగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ముస్లింలీగ్ లాంటి పార్టీలను ముద్దాడిన కాంగ్రెస్‌కు బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించే అర్హత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మజ్లిస్ కోరలు పీకగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. దేశంలో మూడో ఫ్రంట్ ఎండమావేనన్నారు.