మోడీ జనాదరణను చూసి కాంగ్రెస్‌కు భయం: వెంకయ్య | Venkaiah naidu takes on congress at Narendra Modi's meeting | Sakshi
Sakshi News home page

మోడీ జనాదరణను చూసి కాంగ్రెస్‌కు భయం: వెంకయ్య

Published Mon, Aug 12 2013 2:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Venkaiah naidu takes on congress at Narendra Modi's meeting

సాక్షి, హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకుగాను కాంగ్రెస్ పార్టీ.. సీబీఐని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని, అదే జరిగితే దేశంలోనే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బీజేపీ ‘నవభారత యువభేరి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజలందరూ ఇప్పుడు గుజరాత్ మోడల్ పాలనను, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు భయపడి కాంగ్రెస్ ఆయనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా పేరున్న సీబీఐని ఆ పార్టీ మోడీ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
 
 దేశ ప్రజలు ఈ రోజు మార్పును కోరుకుంటున్నారని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను ఒక్కటి చేసే పార్టీ బీజేపీయేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, రాయలసీమ కాంగ్రెస్, కోస్తా కాంగ్రెస్‌లుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనూ కాంగ్రెస్ అనేక రకాల పేర్లతో ఎన్నో సార్లు చీలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా రకరకాలు చీలిపోయారని, జనతాదళ్  పార్టీ సైతం చీలికలు పీలికలు అయిందన్నారు. దేశ ప్రజలకు సమగ్ర విశ్వాసం కలిగించగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ముస్లింలీగ్ లాంటి పార్టీలను ముద్దాడిన కాంగ్రెస్‌కు బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించే అర్హత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మజ్లిస్ కోరలు పీకగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. దేశంలో మూడో ఫ్రంట్ ఎండమావేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement