ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్
ఢిల్లీ: యాంత్రిక జీవితం నుంచి మళ్లీ మనమంతా వెనక్కి వెళ్లాలని, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి విజయ్ గోయల్, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, ఢిల్లీలోని తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... యోగాకు మతం లేదని, దానిని అందరూ అనుసరించాలని సూచన చేశారు. సూర్య నమస్కారం ఇష్టం లేకుంటే చంద్ర నమస్కారం చేయవచ్చునని తెలిపారు.
భారత దేశం ఎన్నడూ కూడా ఏ దేశంపైన దాడులు చేయలేదన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునేది భారతదేశమని, ప్రపంచమంతా ఒక కుటుంబం లాగా బతకాలన్నదే భారతీయ సంస్కృతి అని తెలియజేశారు. సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లడమే భారతీయ సంస్కృతని అభివర్ణించారు. విశిష్టమైన ఈ సంస్కృతిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. 42 ఏళ్ల తర్వాత ఎన్నికల ఉపన్యాసాలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారని చెప్పారు. రాజ్యాంగ విధులు నిర్వహించడం ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment