సాక్షి, ఢిల్లీ: పౌరులకు సరైన సమయంలో నాణ్యమైన సేవలు అందించడంపై మరింత దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.ఆయన సోమవారం ‘యాక్సలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నరమెంట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 2024 నాటికి 20కోట్ల మందికి కుళాయిల ద్వారా తాగునీరందించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకోవడం అభినందనీయమన్నారు.
యువతకు సరైన నైపుణ్యాన్ని అందిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ పథకం కోట్లాది మంది చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, మహిళలకు గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. దేశాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి పరిశ్రమలోనైపుణ్యాభివృద్ధికేంద్రాన్ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ను ప్రత్యేకంగా అభినందించారు.
వివిధ ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని వివరిస్తూ.. 28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరచడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పుస్తక సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు శ్రీ కేజే అల్ఫోన్స్‌ను, పుస్తక ప్రచురణకర్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర మంత్రులు శ్రీ వి.మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్, ఈ పుస్తకంలో వ్యాసాలు రాసిన రచయితలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment