విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్ వైపు..
వెంకయ్యనాయుడు విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అకర్షితులయ్యూరు. 1970 దశకంలోనే లా విద్యాభ్యాసం పూర్తి చేసినా న్యాయవాది వృత్తి జోలికి పోకుండా ఉద్యమాల వైపు అడుగులు వేశారు. విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొంటూ 1973-74లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తొలిసారి ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి ఓటమి పాలయ్యూరు. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఈయన కేంద్ర మంత్రి పదవి చేపట్టడం ఇది రెండోసారి.
* ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చవటపాళెం గ్రామంలో 1949 జూలై 1న రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించారు.
*నెల్లూరులో బీఏ, విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో బీఎల్ విద్యనభ్యసించారు.
* 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని మళ్లీ ఉదయగిరి నుంచి విజయం సాధించారు.
* 1989లో బాపట్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 1996లో బీజేపీ బలంగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో సలావుద్దీన్ ఓవైసీపై పోటీ చేసినా ఓటమినే ఎదుర్కోవాల్సి వచ్చింది.
* 1998లో కర్ణాటక నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2004లో మరోసారి, 2010లో మూడోసారీ అక్కడినుంచే ఆయన రాజ్యసభకు ఎంపికయ్యూరు.
* 2000- 2002 మధ్య కాలంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో పదవికి రాజీనామా చేశారు. 2004 వరకు ఈ పదవిలో కొనసాగారు.
* ఈయన సతీమణి ఊషమ్మ. పిల్లలు హర్షవర్ధన్, దీప