జయేశ్‌రంజన్‌కు పురస్కారం అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్:పార్టీ ఫిరాయింపుదారులను రీకాల్ చేసే డిమాండ్ బలంగా వినిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఫిరాయింపుల పరిస్థితిని చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులను మూడు నెలల్లో పరిష్కరించే దిశగా ప్రిసైడింగ్ అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు. రాజకీయ నాయకులపై ఎన్నికల పిటిషన్లు, క్రిమినల్ కేసులు నిర్ణీత పద్ధతిలో ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరగా నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితి మారాలన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన హైదరాబాద్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ 46వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చట్టసభల్లో తరచూ అంతరాయాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.
ఈ తరహా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని, రాజ్యాంగ నిర్మాతల దృష్టికి ఈ తరహా విధానాలు ప్రతికూలంగా కనిపిస్తాయని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిలబెట్టడంలో విఫలం అయినట్లుగానే భావించాలన్నారు. చట్ట సభల్లో తరచూ అంతరాయాలు ప్రజాస్వామ్య మూల స్థంభం పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయన్నారు. ప్రజా జీవితాల్లో ఉండేవారు కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ‘‘చర్చించండి...నిర్ణయం తీసుకోండి...కానీ ఆటంకాలు సృష్టించకండి’’అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టసభల సమర్థవంతమైన పని తీరు కోసం ఇదే సరైన మార్గమని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు స్థిరమైన ప్రభుత్వం దిశగా తమ ఎంపికను స్పష్టంగా తెలియజేశారన్నారు.
ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం లాంటి సమస్యలను అధిగమించే దిశగా ప్రభుత్వాలు ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, మెరుగైన మౌలిక వసతుల ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రజల ఆనందంగా మలచాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో సమర్థవంతమైన నిర్వహణ పద్ధతులు ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగాలని, ఆర్థిక వృద్ధిని సమాజవృద్ధిగా మలిచేందుకు హెచ్‌ఎంఏ వంటి సంస్థల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. దేశంలో జీఎస్టీ ఓ విప్లవాత్మక పన్నుల వ్యవస్థకు కొలమానమన్నారు. 17 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న సుదీర్ఘ చర్చలను కొలిక్కి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూపిన చొరవ, చాకచక్యాన్ని ఆయన ప్రశంసించారు. జీఎస్టీ కౌన్సిల్ 34 సమావేశాల్లో అన్ని నిర్ణయాలు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, ఇది గొప్ప నిర్వహణ ద్వారానే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
సంస్కరణలు వేగవంతం
ప్రధానమంత్రి ప్రారంభించిన సంస్కరణలను వేగవంతం చేయడానికి సమయం ఆసన్నమైందని, రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ప్రపంచ బ్యాంకు తాజా సూచనలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్నాయన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాలు కలసికట్టుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవాలని సూచించారు. పారదర్శకత, సమగ్రత, నైతికత, నిజాయితీ సూత్రాలు చాలా ముఖ్యమని, వ్యాపార కార్యకలాపాల్లో అవి ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. అభివృద్ధి క్రమంలో అవినీతి, కుంభకోణాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఆయన, ఆర్థిక నేరస్థులు విదేశాలకు పారిపోయే అవకాశం ఇవ్వకూడదని తెలిపారు.
జయేశ్ రంజన్‌కు పురస్కారం
ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీల కింద పురస్కార గ్రహీతలకు ఉపరాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. మేనేజర్ ఆఫ్ ద ఇయర్ – 2018ను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ పీసపాటి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment