సాక్షి, విజయవాడ : అన్నదాత కడుపు మండింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో పంట పండక తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు చావే శరణం అనుకున్నారు. పంట పొలాల్లో పురుగులకు కొట్టాల్సిన పురుగుల మందును ప్రాణం తీసుకోవడానికి ఉపయోగించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే నున్న పోలీస్‌స్టేషన్ వద్ద ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. నకిలీ మిర్చి విత్తనాల కారణంగా తాము నష్టపోయామని, ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలంటూ బుధవారం మధ్యాహ్నం రైతులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. తన ఆందోళన పట్టించుకోకుండా అరెస్టు చేయడంతో బాణాల పూర్ణ, వడ్డెర తిరుపతరావు, గోగేసు రామయ్యలు పురుగుమందు తాగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, సీపీఎం పార్టీ నేతలు, పలు రైతుల సంఘాలు, ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి. నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తోందని మండిపడ్డారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment