టీడీపీలో అసమ్మతి సెగలు
- అసంతృప్తితో రగులుతున్న సీనియర్లు
- ‘తూర్పు’లో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు
- గుడివాడలో ముదిరిన వర్గపోరు
- నూజివీడులో కులాలవారీగా జట్టు కట్టిన వైనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా నిండకముందే టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపైనే మాటల తూటాలు పేలుస్తున్నారు. గుడివాడ, నూజివీడు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
ఎన్నికల నుంచే అసమ్మతి...
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటమి భయంతో ఇతర పార్టీల నాయకులను భారీగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వారికి టీడీపీ అధినేత చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. కొందరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని నమ్మించారు. అయితే, ఎన్నికల ముందే కొందరికి చంద్రబాబు టికెట్లు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిగిలిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా తాత్సా రం చేస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. మరోవైపు ఒకే నియోజకవర్గంలో కొందరు నాయకులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి.
‘గుడివాడ’లో గందరగోళం
గుడివాడ నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన పిన్నమనేని కూడా గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని పిన్నమనేని వర్గీయులు మండిపడుతున్నారు. ఇటీవల గుడివాడలో జరిగిన టీడీపీ నందివాడ మండల సమావేశంలో పిన్నమనేని మాట్లాడుతూ తన అనుచరులు, సహచరులకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక పింఛన్ల తనిఖీ కమిటీల్లో తాను చెప్పిన వారిని ఒక్కరినీ నియమించలేదని, మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని కూడా తాను సూచించిన వ్యక్తికి ఇవ్వలేదని పిన్నమనేని ఇటీవల మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రావి వెంకటేశ్వరరావు హవా సాగుతుండటంతో పిన్నమనేని వర్గీయులు జీర్జించుకోలేకపోతున్నారు.
కనీస ప్రాధాన్యం దక్కని యలమంచిలి రవి!
తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి టీడీపీలో కనీస ప్రాధాన్యత కూడా లభించడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన యలమంచిలి రవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి దేవినేని నెహ్రూ (కాంగ్రెస్), గద్దె రామ్మోహన్ (టీడీపీ)లపై గెలుపొందారు.
అప్పట్లో వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా మద్దతు ఇవ్వడంతో రవి సునాయాసంగా గెలుపొందారు. అయితే, పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత రవి కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. గత ఏడాది జరిగిన రాష్ట్ర విభజన, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవి మళ్లీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించారు. వివాదరహితుడిగా పేరున్న ఆయనకు సీటు ఇస్తానని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ముందు సీన్ రివర్స్ అయ్యింది. తూర్పు టికెట్‌ను గద్దె రామ్మోహన్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రవికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన వర్గీయులు అసమ్మతితో రగిలిపోతున్నారు.
నూజివీడులో కులాల కుమ్ములాట
నూజవీడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కులాల వారీగా జట్టు కట్టి ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన అని ఒక సామాజికవర్గ నేతలు చెబున్నారు. మరో సామాజికవర్గానికి చెందిన టీడీపీ నూజివీడు మండల అధ్యక్షుడు కాప శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు నూతక్కి వేణు కలిసి తమ నియోజకవర్గానికి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇన్‌చార్జి కాదని ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఈ నియోజకవర్గంలో రెండు సామాజికవర్గాల మధ్య పోరు సాగుతోంది. మరోవైపు ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా ముద్దరబోయినకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఇలా జిల్లా అంతటా టీడీపీలో అసమ్మతి నెలకొంది. కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండగా నిలుస్తున్నారు. మరికొందరికి మంత్రి కొల్లు రవీంద్ర అండగా ఉంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం గొడవలకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.