సాక్షి, అమరావతి: లైసెన్స్ జారీ అధికారులైన జాయింట్ కలెక్టర్‌లను సంప్రదించాకే సినిమా టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలన్నింటికీ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకొచ్చిన థియేటర్ల యజమానులకే తమ ఉత్తర్వులు వర్తిస్తాయంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పత్రికా ప్రకటనను హైకోర్టు తప్పుపట్టింది. పత్రికాముఖంగా అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆయనకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో అదనపు మెటీరియల్ పేపర్లను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వ న్యాయవాది(హోం) మహేశ్వరరెడ్డి కొంత గడువు కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో టికెట్ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35తో సంబంధం లేకుండా, ఈ జీవో జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ అప్పీళ్లపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా థియేటర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న ధర్మాసనం ఉత్తర్వులు కేవలం హైకోర్టును ఆశ్రయించినవారికి మాత్రమే వర్తిస్తాయంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి పత్రికా ప్రకటన జారీ చేశారని తెలిపారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతవారం తామిచ్చిన ఉత్తర్వుల్లో థియేటర్లు అని స్పష్టంగా పేర్కొన్నామని.. దీని అర్థం రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లనీ స్పష్టతనిచ్చింది.
మా ఉత్తర్వులు థియేటర్లన్నింటికీ వర్తిస్తాయి
Published Tue, Dec 21 2021 4:13 AM | Last Updated on Tue, Dec 21 2021 4:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment