AP High Court Verdict on Online Sale of Cinema Tickets By AP Government on July 1 - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ టికెట్లపై 1న ఉత్తర్వులిస్తాం

Published Thu, Jun 30 2022 3:59 AM | Last Updated on Thu, Jun 30 2022 9:02 AM

Andhra Pradesh High Court on BookMyShow online Tickets - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ దాఖలైన ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ జరుపుతామని తెలిపింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్‌ మై షో, మల్టీప్లెక్స్‌ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. బుక్‌ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్‌ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని అన్నారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్‌ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్‌ ధర ఎక్కువ ఉంటుందన్నారు.

ప్రభుత్వం సర్వీసు చార్జి మాత్రమే వసూలు చేస్తున్నందున, వినియోగదారులు ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొంటారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మాకు అలా అనిపించడం లేదు. మీరు కన్వీనియన్స్‌ చార్జి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అది వసూలు చేయదు. దీంతో ప్రభుత్వం వద్ద తక్కువ రేటుకు టికెట్‌ దొరుకుతుంది. అది మీకు ఇబ్బంది. మీ సమస్యంతా కన్వీనియన్స్‌ ఫీజే’ అని వ్యాఖ్యానించింది.

వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించండి 
మల్టీప్లెక్స్‌ థియేటర్ల అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు. పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్‌ కావాలన్నా ఇస్తామని  తెలిపారు. ఒప్పందాల ద్వారా తమ వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు.

ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్‌ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దీంతో అనుబంధ వ్యాజ్యాల్లో జూలై 1న ఉత్తర్వులిస్తామని  ధర్మాసనం తెలిపింది.

పలు కీలక అంశాలు ఉన్నందున కొత్త విధానాన్ని 15–20 రోజుల పాటు ఎందుకు ఆపకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున  ఏజీ స్పందిస్తూ, కొత్త విధానానికి అత్యధికులు ఆమోదం తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా అందరితో చర్చించి, వారి సలహాలతో కొత్త విధానాన్ని తెచ్చామన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement