ఆన్‌లైన్‌ టికెట్లపై రోజంతా వాదనలు | Arguments in AP High Court over sale of movie tickets online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ టికెట్లపై రోజంతా వాదనలు

Published Wed, Jun 29 2022 4:04 AM | Last Updated on Wed, Jun 29 2022 8:07 AM

Arguments in AP High Court over sale of movie tickets online - Sakshi

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో వాదనలు మంగళవారం వాడీవేడిగా సాగాయి. బుక్‌ మైషో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దాదాపుగా రోజంతా వాదనలు సాగాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్ల సంఘం వాదనల నిమిత్తం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వుల జారీకి బుక్‌ మైషో తరఫున సీనియర్‌ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అందరి వాదనలు విన్న తరువాతే నిర్ణయాన్ని వెలువరిస్తామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతకాలం ప్రభుత్వం తెస్తున్న వ్యవస్థను కొనసాగనిద్దామని, అప్పుడు బుక్‌ మైషో వ్యక్తం చేస్తున్న భయాందోళనలు నిజమో కాదో తేలిపోతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్ట నిబంధనలతో పాటు ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బుక్‌ మైషో) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.  

బాహుబలికి 50 శాతం ఆక్యుపెన్సీ 
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌  ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. బుక్‌ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థను ఏపీఎఫ్‌డీసీ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ టికెట్లను 50 శాతం సీటింగ్‌ కెపాసిటీకి పరిమితం చేసి మిగిలిన టికెట్లను థియేటర్‌లో నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వంద శాతం టికెట్‌లను ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాయన్నారు. రూ.100 బేస్‌ రేటు కలిగిన టికెట్‌ను బుక్‌ మై షో రూ.145కు విక్రయిస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దేశంలోనే అత్యధిక గ్రాస్‌ సాధించిన బాహుబలి–2 సినిమాకు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీనే బుక్‌ మైషో లాంటి సంస్థలు చూపాయని నివేదించారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయాలపై తామేమీ నిషేధం విధించలేదని, నియంత్రణ మాత్రమే చేస్తున్నామన్నారు. కొత్త పోర్టల్‌ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 2 శాతం లోపు సర్వీస్‌ చార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం పోటీదారుగా వ్యవహరించదని ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాన్ని ముందుకు సాగనివ్వాలని, కొంతకాలం పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 

అంతా ప్రభుత్వ పోర్టల్‌లోనే కొంటారు.. 
బుక్‌ మైషో తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ ద్వారా గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థ వల్ల వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి 2 శాతం సర్వీసు చార్జీ చెల్లించాలంటే వినియోగదారుడి నుంచి అధిక మొత్తాలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 2 నుంచి కొత్త విధానం అమలు చేయకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఎక్కడ ఉందని, ఏ చట్టం నిషేధిస్తుందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది.

ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వండి
జూలై 2 నుంచి కొత్త విధానం అమలుకు ఏపీఎఫ్‌డీసీతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదించారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతోందన్నారు. ఒప్పందాల కోసం ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ఏజీ శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ 80 శాతం థియేటర్లకు బీ లైసెన్సులు లేవని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement