సాక్షి, అమరావతి: సినిమా.. సగటు పౌరునికి అందుబాటులో ఉన్న మాద్యమం. కానీ, ఈ వినోదాల వెండితెరను తమ దోపిడీకి రాచబాటగా చేసుకుంటోంది సినిమా మాఫియా. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాల పేరుతో ‘బుక్ మై షో’ అనే ప్రైవేటు సంస్థ ఏళ్ల తరబడి యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతోంది. అడ్డగోలు ఆర్జనకు కక్కుర్తిపడుతున్న థియేటర్ల యాజమాన్యాలు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి.
థియేటర్లను గుప్పెటపట్టి.. టికెట్ల ధరలపై అత్యధికంగా కమీషన్లు వసూలుచేస్తూ ‘బుక్ మై షో’ దోచుకుంటోంది. దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ మాఫియాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ఇప్పుడీ మాఫియా బెంబేలెత్తుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా విక్రయిస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది.
థియేటర్లను గుప్పెటపట్టి గుత్తాధిపత్యం
‘బుక్ బై షో’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సినిమా థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుంది. థియేటర్ల యజమానులకు డిపాజిట్ల రూపంలో అప్పులిచ్చి తమ సంస్థ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలనే షరతుతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య నిరోధక చట్టానికి విరుద్ధమైనప్పటికీ బేఖాతరు చేస్తోంది.
ఏపీలో 1,140 థియేటర్లు ఉండగా.. తెలంగాణాలో 1,250 థియేటర్లు (వాటిలో 40 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనేనివే) ఉన్నాయి. వీటిల్లోని అత్యధిక థియేటర్లు ‘బుక్ మై షో’ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అంతేకాక.. దేశంలో ఏకంగా 78 శాతం ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయాలను బుక్ మై షో కంపెనీ తన గుప్పెట్లో పెట్టుకుంది.
ఒక్కో టికెట్‌పై రూ.25వరకు అదనపు భారం..
ఇక సినిమా థియేటర్లు తమ గుప్పెట్లోకి వచ్చిన తరువాత టికెట్ల దందాకు ఈ సంస్థ తెరతీసింది. థియేటర్లను బట్టి ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనంగా వసూలుచేస్తోంది. వాటిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అయితే టికెట్‌కు రూ.8 చొప్పున, మల్టీపెక్స్ థియేటర్లకు రూ.14 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. అంటే.. టికెట్‌పై ఆ సంస్థ రూ.11 వరకు లాభం తీసుకుంటోంది.
థియేటర్ల యాజమాన్యాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా 50శాతానికి పైగా టికెట్లను ఈ సంస్థకే కేటాయిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుడిపై ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనపు భారం పడుతోంది. ఇలా బుక్ మై షో ఎంతగా దోపిడీకి పాల్పడుతో స్పష్టమవుతోంది. మరోవైపు.. ఎన్ని టికెట్లు ఎంత ధరకు విక్రయిస్తోందన్న రికార్డులు కూడా ప్రభుత్వానికి చెప్పకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. తద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతోంది.
ఈ నేపథ్యంలో.. మార్కెట్‌లో ఉన్న కొన్ని పోటీ సంస్థలు సినిమా టికెట్‌పై రూ.11 అదనపు చార్జీతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని ముందుకొచ్చాయి. కానీ, ముందస్తు ఒప్పందాల పేరిట ‘బుక్ మై షో’ సంస్థ అందుకు అడ్డంకులు సృష్టిస్తోంది.
రూ.1.95 సర్వీస్ చార్జితోనే విక్రయాలకు ఏపీ నిర్ణయం
దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను దోచుకుంటున్న ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. సినిమా టికెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌లో విక్రయించాలన్న విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. టికెట్‌పై కేవలం రూ.1.95 మాత్రమే సర్వీస్ చార్జ్‌తో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. దాంతో తమ దందాకు అడ్డుకట్ట పడుతుందని ‘బుక్ మై షో’ సంస్థ ఆందోళన చెందింది.
ఏపీ ప్రభుత్వ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమ అక్రమాల పుట్టి పూర్తిగా మునిగిపోతుందని ఆ సంస్థ, థియేటర్లు బెంబేలెత్తుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘బుక్ మై షో’ కోర్టులో కేసు వేసింది. కానీ, వీరి దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గుత్తాధిపత్యం చట్టవిరుద్ధమే..
మరోవైపు.. బుక్ మై షో గుత్తాధిపత్య పోకడలతో సగటు ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్న అంశంపై కొందరు ఢిల్లీలోని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను ఆశ్రయించారు. దేశంలో ఏ రంగంలో కూడా గుత్తాధిపత్యంతో వినియోగదారులు నష్టపోకుండా చూసే చట్టబద్ధమైన సంస్థ ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో సినిమా విక్రయాల వాటా, వాటి విలువ మొదలైన అంశాలతో నివేదిక సమర్పించాలని కమిషన్ ‘బుక్ మై షో’ సంస్థను ఆదేశించింది.
అయినా ఆ సంస్థ ఖాతరు చేయలేదు. ఈ కేసుపై ఇరుపక్షాల వాదనాలు విన్న తరువాత ‘బుక్ మై షో’ గుత్తాధిపత్యంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా కమిషన్ అభిప్రాయపడింది. థియేటర్లతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం చట్ట విరుద్ధమని చెప్పింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి డైరెక్టర్ జనరల్(డీజీ)ని ఆదేశిస్తూ ఈనెల 16న ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment