సాక్షి, అమరావతి: టికెట్ ధరలు, సర్వీసు చార్జీలను లైసెన్సింగ్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) మాత్రమే నిర్ణయించగలదని, ప్రభుత్వం కాదని హైకోర్టు పేర్కొంది. టికెట్ ధరలు, సర్వీసు చార్జీల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలియచేయగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్ అథారిటీనేనని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ టికెట్ల విక్రయం సందర్భంగా సినిమా థియేటర్లు ప్రేక్షకులకు విధించే సర్వీసు చార్జీని టిక్కెట్ ధరలో కలపడానికి వీల్లేదని పేర్కొంది.
సర్వీసు చార్జీ విధింపు నిధుల మళ్లింపునకు దారితీయదని తెలిపింది. ఆన్‌లైన్ టికెట్ల విక్రయ ప్రక్రియ రికార్డవుతుందని, అందువల్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు రిస్క్ ఉండదని పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా విక్రయించే టికెట్ మొత్తం ధరలో సర్వీసు చార్జీని కలపడాన్ని తప్పుబట్టింది. పాత విధానంలోనే ఆన్‌లైన్ టికెట్లను విక్రయించుకోవచ్చునని, ఆన్‌లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రేక్షకుడిపై సర్వీసు చార్జీ భారం మోపవచ్చని తెలిపింది.
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ ధరలను ఖరారు చేస్తూ జారీచేసిన జీవోను, సర్వీసు చార్జీని కూడా కలిపి ఆన్‌లైన్ టికెట్ ధరను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా, ఆన్‌లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ‘ప్రత్యేక సౌకర్యం’ ప్రేక్షకులకు కల్పిస్తున్నామని, ఇందుకు తాము వసూలుచేసే సర్వీసు చార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని అసోసియేషన్ వాదించింది. ఈ వ్యాజ్యంపై గత వారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరిన విధంగా బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు
‘సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్లు భాగం కాదు. ఆ కమిటీ కూడా టికెట్ ధరలు నిర్ణయించే సమయంలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు. వారిని సంప్రదించినట్లుగానీ, వారి అభ్యంతరాలు స్వీకరించినట్లుగానీ చూపేందుకు ఎలాంటి డాక్యుమెంట్‌ను ఈ కోర్టు ముందుంచలేదు. ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం ప్రకారం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించినందుకు సినిమా థియేటర్లు ప్రేక్షకుడిపై విధించే సర్వీసు చార్జీని టికెట్ మొత్తం ధరలో కలపడానికి వీల్లేదు.
సినిమా హాలులో ప్రవేశానికి చెల్లించే ధరే.. అసలు టికెట్ ధర. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ఉపయోగించుకున్నందుకు విధించే చార్జీలను అసలు టికెట్ ధరగా పరిగణించడానికి వీల్లేదు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని కూడా పిటిషనర్ ప్రశ్నించారు. జీవో 69 ప్రకారం టికెట్ ధరలను నిర్ణయించాల్సింది లైసెన్సింగ్ అథారిటీయే తప్ప ప్రభుత్వం కాదు. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది. ఈ విషయంపై లోతుగా విచారణ జరపాలి..’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
AP High Court: సినిమా టికెట్ ధరల నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీదే
Published Thu, Apr 21 2022 4:18 AM | Last Updated on Thu, Apr 21 2022 9:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment